పది విద్యార్థులకు గ్రేడింగులు నేడే!

ABN , First Publish Date - 2021-05-21T16:41:45+05:30 IST

పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ల వివరాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. కరోనా కారణంగా గతేడాది మాదిరిగానే ఈసారి సైతం వార్షిక పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యక్ష

పది విద్యార్థులకు గ్రేడింగులు నేడే!

ఫీజు చెల్లించిన 5,21,392 మంది పాస్‌ 

25,473 మంది విద్యార్థులు ఫెయిల్‌ 

పేరు, పుట్టిన తేదీతో మెమోలు 

2 లక్షల మందికి ఏ1 గ్రేడ్‌?


హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ల వివరాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. కరోనా కారణంగా గతేడాది మాదిరిగానే ఈసారి సైతం వార్షిక పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యక్ష తరగతులు నిర్వహించిన 44 రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ ఫార్మెటివ్‌ అసెస్మెంట్‌ (ఎఫ్‌ఏ-1) పరీక్ష నిర్వహించారు. 20 మార్కుల ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ఐదింతలు పెంచి (100 మార్కులకు) ఫలితాలు సిద్ధం చేశారు.  ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షలకోసం ఫీజు చెల్లించిన వారందరినీ ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.


ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతిలో 5,46,865 విద్యార్థులు ప్రవేశాలు పొందారు. పరీక్ష ఫీజు రూ.150గా నిర్ణయించగా.. రూ.50 ఆలస్య రుసుముతో మార్చి-16 వరకు గడువు ఇచ్చారు. రూ.200తో మార్చి-18, రూ.500తో మార్చి-22 వరకు గడువు ఇచ్చారు. అయినప్పటికీ ప్రవేశాలు పొందిన మొత్తం విద్యార్థుల్లో 5,21,392 (95.34ు) మంది ఫీజు చెల్లించగా.. 25,473 (4.65ు) మంది గడువులోపు ఫీజు చెల్లించలేదు. దీంతో వారిలో కొందరు ఎఫ్‌ఏ-1 పరీక్షకు హాజరైనా ఫలితాల్లో పరిగణలోకి తీసుకోలేదు. ఫీజు చెల్లించని వారంతా ఫెయిల్‌ అయినట్టేనని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. 


రికార్డుస్థాయిలో ఏ1 గ్రేడ్‌.. 

91-100 మార్కులకు ఏ1 గ్రేడ్‌, 81-90 ఏ2, 71-80 బీ1, 61-70 బీ2, 51-60 సీ1, 41-50 ిసీ2, 35-40 డీ, 0-34 ఈ గ్రేడ్‌ చొప్పున కేటాయిస్తారు. ఈ లెక్కన ఈసారి పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,392 విద్యార్థుల్లో దాదాపు 2 లక్షల విద్యార్థులు ఏ1 గ్రేడ్‌ సాధించినట్టు తెలిసింది. గతేడాది పదోతరగతిలో 5,34,903 మంది ఉత్తీర్ణులు కాగా, వీరిలో రికార్డుస్థాయిలో 1,41,382 (26.43ు) మంది 10/10 జీపీఏ సాధించారు. ఈసారి వీరి సంఖ్య మరింతగా పెరగనుంది. 


పేరు నమోదు చేస్తే మెమో.. 

ప్రతిసారి పదోతరగతి ఫలితాల కోసం వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్‌ నమోదు చేస్తుండేవారు. గతేడాది సైతం పరీక్షలు జరగకపోయినా హాల్‌ టికెట్‌ ద్వారానే మెమోలు పొందారు. కానీ ఈసారి హాల్‌ టికెట్‌ నెంబర్లు కేటాయించక ముందే పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఈసారి విద్యార్థులు హాల్‌టికెట్‌ స్థానంలో తమ పేరు, పుట్టిన తేదీ, పాఠశాల పేరు నమోదు చేసి మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే విద్యార్థులు వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.inనుంచి మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


Updated Date - 2021-05-21T16:41:45+05:30 IST