Telugu Academy Scam: ఏవి అసలు.. ఏవి నకిలీ?
ABN , First Publish Date - 2021-10-11T13:25:27+05:30 IST
తెలుగు అకాడమీ స్కామ్‌ను..
ఎఫ్‌డీలను పోల్చుకోలేక సతమతం
ఫోరెన్సిక్‌ను ఆశ్రయించనున్న సీసీఎస్!
పోలీసుల కస్టడీకి తొమ్మిది మంది
హిమాయత్‌నగర్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలుగు అకాడమీ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు.. ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణంలో నిందితులు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎ్‌ఫడీ) బాండ్లకు కలర్ జిరాక్సులు తీయించి, ఒరిజినల్‌తో నిధులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సీజ్ చేసిన ఎఫ్‌డీలలో ఏవి అసలు? ఏవి నకిలీవో తేల్చుకోలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై అకాడమీ అధికారులు ఫిర్యాదు ఇచ్చిందే తడవుగా.. ఎఫ్‌డీ పత్రాలను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. అలా రెండు రోజుల్లో రూ.320 కోట్లకు పైగా విలువచేసే ఎఫ్‌డీ బాండ్లను సీసీఎ్‌సకు తరలించారు. వాటిని ఎంత నిశితంగా పరిశీలించినా.. ఏవి అసలో, ఏవి కలర్ జిరాక్సో పోల్చుకోలేకపోతున్నామని ఓ అధికారి తెలిపారు. ఈ కేసులో మధ్యవర్తులు, నిందితులు, బ్యాంకుల మేనేజర్లు ముందుకు వస్తే తప్ప.. ఏవి అసలైనవో తెలిసే అవకాశాలు లేవని చెబుతున్నారు. నిందితుల్లో చాలా మంది విచారణకు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవడం అనివార్యంగా మారుతోంది. అకాడమీ డైరెక్టర్లుగా ఎవరున్నా.. ‘‘నీక్కొంత.. నాకింత’’ అనే విధంగా కమీషన్ల తంతు కొనసాగేదని సీసీఎస్ పోలీసులు గుర్తించారు.
గడిచిన పదేళ్లుగా డైరెక్టర్లకు పీఏగా వ్యవహరిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సురభి వినయ్‌కుమార్, మరో ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వినయ్‌కుమార్‌ను ఐదున్నర గంటల పాటు విచారించిన సందర్భంగా పలు విషయాలు వెల్లడైనట్లు సమాచారం. పదేళ్లపాటు ముగ్గురు డైరెక్టర్ల వద్ద పీఏగా పనిచేసినట్లు చెప్పిన వినయ్‌కుమార్.. ప్రతి ఎఫ్‌డీకి కమీషన్ ఉండేదని స్పష్టం చేశాడని తెలిసింది. పదేళ్లలో ఈ కమీషన్ల లెక్క సుమారు రూ.10 లక్షలుగా ఉండొచ్చని పోలీసులు గుర్తించారు. బ్యాంకర్లు ఇచ్చే కమీషన్‌ను వినయ్‌కుమార్ స్వయంగా తీసుకుని డైరెక్టర్లకు ఇచ్చేవాడని, ఆ క్రమంలో అందులో తన వాటాగా కొంత తీసుకునేవాడని నిర్ధారించారు. బ్యాంకర్ల నుంచి కూడా వినయ్‌కుమార్‌కు నేరుగా కమీషన్ ముట్టేదని నిగ్గుతేల్చారు.
అయితే.. నిధుల గోల్‌మాల్ జరిగింది సోమిరెడ్డి హయాంలో కావడంతో.. ఈ కాలంలో మొత్తం ఎన్ని ఎఫ్‌డీలు చేశారు? అనే కోణంపై పోలీసులు దృష్టిసారించారు. కాగా అకాడమీ స్కామ్ నిందితులు సాయికుమార్, వెంకటరామన్, సోమశేఖర్, డాక్టర్ వెంకట్, సత్యనారాయణ, మొహియుద్దీన్, పద్మావతి, మస్తాన్ వలీ, రమేశ్‌లను సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారం సాయంత్రం అకాడమీ ఇన్‌చార్జ్ ఆఫీసర్ రమేశ్ సహా నలుగురిని కస్టడీలోకి తీసుకుని సీసీఎ్‌సకు తరలించారు. ఆదివారమంతా వారి విచారణ కొనసాగింది.