ఉద్యోగ ఖాళీల భర్తీ.. ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2021-12-07T17:00:24+05:30 IST

రాష్ట్రంలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. 33 జిల్లాలతో ‘రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్‌ వ్యవస్థ-2018’కి అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి.. వారిలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు..

ఉద్యోగ ఖాళీల భర్తీ.. ఎప్పుడంటే..!

విభజనకు వేళాయె

ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు జారీ..

కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ఉత్తర్వులు

సీనియారిటీ ప్రాతిదికనన ఉద్యోగుల విభజన..

జిల్లా, జోనల్‌/మల్టీ జోనల్‌ కమిటీల ఏర్పాటు

తొలుత ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో ప్రక్రియ..

నేడో రేపో జిల్లాల వారీగా ఆప్షన్ల ఉత్తర్వులు

దివ్యాంగులు, వితంతువులకు ప్రాధాన్యం..

మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాల పెదవి విరుపు

‘స్థానికత’ను ప్రతిబింబించడం లేదని విమర్శ..

విభజన పూర్తయ్యాకే.. ఉద్యోగ ఖాళీల భర్తీ!


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. 33 జిల్లాలతో ‘రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్‌ వ్యవస్థ-2018’కి అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి.. వారిలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు పేర్కొంది. ఉద్యోగుల విభజన కోసం కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా క్యాడర్‌ పోస్టుల విభజనకు ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో, జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల విభజనకు సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. విధి విధానాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు (జీవో నంబర్‌ 317) జారీ చేశారు. 1975లో తీసుకొచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 2018 జూన్‌ నుంచి రాష్ట్రంలో కొత్త జోనల్‌ వ్యవస్థను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. 33 జిల్లాలతో కలిపి ‘తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌  ఆర్డర్‌-2018’ను అమల్లోకి తెచ్చారు. దీనికి అనుగుణంగా 33 జిల్లాలకు ఉద్యోగులను విభజించాల్సి ఉంది. ఇప్పటికే క్యాడర్లవారీగా అన్ని శాఖల్లో జిల్లా, జోనల్‌, మల్టీ జోన్‌ల ఉద్యోగుల వర్గీకరణను పూర్తి చేసింది. కానీ, ఉద్యోగుల విభజన అంశం మాత్రం నెలల తరబడి నానుతోంది. 


క్యాడర్‌ స్ట్రెంథ్‌ నిర్ధారణలో ఆలస్యం..

ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం ద్వారా విభజన చేపట్టాలని మొదట్లో నిర్ణయించింది. అయుతే జిల్లాల వారీగా క్యాడర్‌ స్ట్రెంథ్‌ నిర్ధారణ కాకపోవడంతో.. విభజనకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం ఇటీవల జిల్లాల వారీగా క్యాడర్‌ స్ట్రెంథ్‌పై ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు, పాత, కొత్త జిల్లాలవారీగా క్యాడర్‌ స్ర్టెంథ్‌ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అందుకే ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం ద్వారా విభజనను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో లేని జిల్లాల్లో మాత్రమే ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతుందని, కోడ్‌ అమల్లో ఉన్న జిల్లాల్లో కోడ్‌ ముగిసిన తర్వాత చేపడతామని పేర్కొన్నారు. విభజన సందర్భంలో టీజీవో, టీఎన్‌జీవోల సంఘాలు, ఇతర ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. విభజన అనంతరం ఉద్యోగులు ఏవైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖ కార్యదర్శికి తెలపవచ్చని పేర్కొంది. మరోవైపు 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల జాబితాను రూపొందించి 8వ తేదీలోగా ముఖ్యకార్యదర్శులకు అందజేయాలని జిల్లా అధికారులను, విభాగాధిపతులకు సీఎస్‌ ఆదేశించారు. 


జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కమిటీలు..

మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఉద్యోగుల విభజన కోసం జిల్లా స్థాయి, జోనల్‌, మల్టీ జోనల్‌ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుని, ఆయా జిల్లాలకు కేటాయిస్తాయి. జిల్లా క్యాడర్‌ ఉద్యోగుల విభజనకు ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా కమిటీలను ఏర్పాటు చేసింది. జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.  విభజన ఇలా...

జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగులు తాము కోరుకునే జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌ గురించి ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వాటిని సంబంధిత జిల్లా/విభాగాధిపతి/కార్యదర్శికి పంపించుకోవాలి.

- ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా కమిటీలు పరిశీలించాలి. సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించాలి.

- ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన ఉంటుంది. 

- 70 శాతం కంటే ఎక్కువగా సమస్య ఉన్న దివ్యాంగులు, మానసిక దివ్యాంగులైన పిల్లలున్న ఉద్యోగులు, కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులు, క్యాన్సర్‌, న్యూరో సర్జరీ, కిడ్నీ, కాలేయ మార్పిడి, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ సంబంధిత ఉద్యోగులకు విభజన సమయంలో ప్రాధాన్యమిస్తారు. 


జిల్లా కేడర్‌ పోస్టులకు మార్గదర్శకాలు..

- ఆయా శాఖల విభాగాధిపతులు తమ శాఖల్లోని ఉద్యోగులకు సంబంధించి పాత జిల్లాలు, సీనియారిటీ ప్రాతిపదికన జాబితాను రూపొందించాలి. సస్పెన్షన్‌, శిక్షణ, సెలవు, ఫారిన్‌ సర్వీస్‌, డిప్యుటేషన్‌లలో ఉన్నవారిని కూడా జాబితాలో చేర్చాలి. 

- పాత జిల్లాల్లోని ఉద్యోగులు ప్రాధాన్య క్రమంలో ఇచ్చే ఆప్షన్ల వారీగా వారిని ఉమ్మడి జిల్లాలోని కొత్త జిల్లాలకు కేటాయిస్తారు. 

- పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లాలకు నిర్దేశించిన వర్కింగ్‌ స్ట్రెంథ్‌కు లోబడి ఉద్యోగులను కేటాయిస్తారు. 

- రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ హనుమకొండ, జయశంకర్‌-భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, రంగారెడ్డి వంటి ఎనిమిది జిల్లాల్లో కొన్ని ఇతర జిల్లాల్లోని ప్రాంతాలు కూడా కలిశాయి. అందుకే కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో లోకల్‌ క్యాడర్‌ కింద ఉన్న ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల్లోని కొత్త జిల్లాలకే కాకుండా, పొరుగున ఉన్న జిల్లాలకు కూడా కేటాయిస్తారు. 


నేడో రేపో ఉత్తర్వులు

ఉద్యోగుల విభజనకు సంబంధించి ఆప్షన్ల ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. తాజా ఉత్తర్వుల్లో ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసింది. వీరే నోడల్‌ చైర్మన్లుగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి వీరు నేడో రేపో ఆప్షన్ల ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. అవే ఉత్తర్వుల్లో గడువును కూడా నిర్దేశిస్తారు. ఆ గడువులోపు ఉద్యోగులు ఆప్షన్ల ప్రొఫార్మాలను సంబంధిత కమిటీలకు పంపాల్సి ఉంటుంది. 


‘స్థానికత’ ఏదీ ?: ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘స్థానికత’ అంశాన్ని స్పష్టంగా పేర్కొనలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి.95ు పోస్టులు స్థానికులకే చెందేలా ప్రభుత్వం 33 జిల్లాలతో కొత్త జోనల్‌ వ్యవస్థను తీసుకొచ్చిందని, కానీ.. 33 జిల్లాల స్థానికత ఆధారంగా విభజన చేపట్టడం లేదని సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇదివరకున్న పాత జిల్లాల స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించబోతోందని, ఇది స్థానికతను ప్రతిబింబించబోదని వివరిస్తున్నారు. పాత ఉమ్మడి జిల్లాల ఉద్యోగులనే కొత్త జిల్లాలకు సీనియారిటీ ప్రాతిపదికన విభజించబోతున్నారని, దీంతో కొత్త జిల్లా స్థానికుడైన ఉద్యోగికి ఆ జిల్లా లభిస్తుందో లేదో సందేహమేనని అంటున్నారు. ౅


జోనల్‌, మల్టీ జోనల్‌ క్యాడర్‌ పోస్టులు...

- జోనల్‌, మల్టీ జోనల్‌ క్యాడర్ల వారీగా నిర్ణయించిన వర్కింగ్‌ స్ట్రెంథ్‌కు అనుగుణంగా జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల విభజన ఉంటుంది. 

- ఉమ్మడి ఏపీలో ఐదో జోన్‌ కింద ఉన్న ఉద్యోగులను కొత్తగా ఏర్పడిన ఒకటో జోన్‌ నుంచి 6వ జోన్‌ వరకు గల ఆరు జోన్ల(నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లోని పోస్టులు మినహాయించి)కు, జనగామ జిల్లాకు కేటాయిస్తారు.

- ఉమ్మడి ఏపీలోని ఆరో జోన్‌ కింద ఉన్న ఉద్యోగులను కొత్తగా ఏర్పడిన ఐదో జోన్‌  నుంచి ఏడో జోన్‌ వరకు(జనగామ జిల్లా పోస్టులు మినహాయించి), రెండో జోన్‌(నిజామాబాద్‌లోని పో స్టులు), జోన్‌ -3(కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట పోస్టులు)కు కేటాయిస్తారు.

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదో జోన్‌ కింద ఉన్న ఉద్యోగులను మల్టీ జోన్‌-1(నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట మినహాయించి), మల్టీ జోన్‌-2లకు, జనగామ జిల్లాకు కేటాయిస్తారు. 

- ఉమ్మడి ఏపీలోని ఆరో జోన్‌ కింద ఉన్న ఉద్యోగులను మల్టీ జోన్‌-2(జనగామ జిల్లా మినహాయించి)కు, మల్టీ జోన్‌-1కు కేటాయిస్తారు. 


విభజన పూర్తయ్యాక.. ఖాళీ పోస్టుల భర్తీ !

ఉద్యోగుల విభజన పూర్తయిన తర్వాతే ప్రభుత్వం.. ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. రాష్ట్రంలో 67,128 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించి, ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారు. అయితే... జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లవారీగా ఉద్యోగుల విభజన పూర్తయ్యాక.. ఏర్పడే ఖాళీలను కలుపుకొని వివరాలు వెల్లడించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అనంతరం జాబ్‌ కేలండర్‌ను విడుదల చేసి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుందని సంఘాల నేతలు వివరిస్తున్నారు.

Updated Date - 2021-12-07T17:00:24+05:30 IST