నెరవేరని కేసీఆర్‌ హామీ.. అది ఉత్తుత్తి మాటేనా!

ABN , First Publish Date - 2021-10-07T13:12:31+05:30 IST

‘‘రాష్ట్రంలోని..

నెరవేరని కేసీఆర్‌ హామీ.. అది ఉత్తుత్తి మాటేనా!

సైనిక సంక్షేమం ఉత్తుత్తి మాటేనా!

రూ.30 కోట్ల సైనిక నిధి సీఎంఆర్‌ఎఫ్‌కు బదిలీ

నాలుగున్నరేళ్లుగా అందులోనే నిధులు.. రిజర్వేషన్ల అమలు ఊసేదీ?

సైనికుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు.. నెరవేరని కేసీఆర్‌ హామీలు


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిధికి ఏటా ముఖ్యమంత్రి, మంత్రులు రూ.25 వేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రూ.10 వేల చొప్పున, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం ఇచ్చేందుకు అంగీకరించారు. తెలంగాణ రాష్ట్రం సైనిక సంక్షేమంలో ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే సైనిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పైసాను సైనికులకే ఖర్చుచేస్తాం’’. ఇవీ 2017 జనవరిలో శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్న మాటలు. సైనికుల కోసం ఆ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి.


కానీ నేటికీ అందులోంచి ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వం ఖర్చుచేయలేదు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సేకరించిన దాదాపు రూ.30 కోట్ల ఆ నిధిని ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌(సీఎంఆర్‌ఎ్‌ఫ)కు మళ్లించింది. దాన్ని సైనిక సంక్షేమ విభాగానికి బదిలీ చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు రాష్ట్ర మాజీ సైనిక సమాఖ్య, ఎక్స్‌సర్వీ్‌సమెన్‌ జేఏసీ పలుమార్లు సమర్పించిన వినతిపత్రాలన్ని బుట్టదాఖలయ్యాయి.


హడావుడిగా ఒక్క ఏడాదే సైనిక నిధిని సేకరించిన ప్రభుత్వం.. ఆ తర్వాత పూర్తిగా విస్మరించింది. సైనికుల సంక్షేమంపై శాసనసభ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో అమలుకావడం లేదని, రాష్ట్రంలోని 40వేలమంది మాజీ సైనికులను ఆదుకోవాలని కోరుతూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను రాష్ట్రమాజీ సైనిక సమాఖ్య, ఎక్స్‌సర్వీ్‌సమెన్‌ జేఏసీ ప్రతినిధులు ఇటీవలే ఒక వినతిపత్రం సమర్పించారు. సైనిక ప్రత్యేక నిధి సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి తమ విభాగానికి బదిలీ అయితేనే.. వాటిని సైనిక సంక్షేమానికి ఉపయోగించే వీలుంటుందని సైనిక సంక్షేమ విభాగ అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. 


ఇళ్ల స్థలాల ఉసేలేదు!

సైనికులకు ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా కల్పిస్తున్నాయి. సైనికుల సంక్షేమంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పలు ఉత్తర్వులు వెలువడ్డాయి. వాటినే తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. విధినిర్వహణలో కొనసాగుతున్న సైనికులు, అమర సైనికుల కుటుంబసభ్యులు, యుద్ధంలో క్షతగాత్రులైన, దివ్యాంగులుగా మారిన వారితో పాటు మాజీ సైనికులకు ప్రయోజనాలను కల్పిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. మాజీ సైనికులు, వితంతవులకు 175 గజాల ఇళ్లస్థలాన్ని కేటాయించే అధికారం కలెక్టర్‌కు అప్పగించారు. మాజీ సైనికులు హౌసింగ్‌ సొసైటీగా ఏర్పడి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.


కరీంనగర్‌ జిల్లాలో దాదాపు 553 మంది మాజీ సైనికులు సొసైటీగా ఏర్పడి 2015లో దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పటికీ వారి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వలేదు. మరో 850మంది మాజీ సైనికులు తమకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే, తెలంగాణ హౌసింగ్‌ బోర్డు కట్టిన ఇళ్లలో హోదాను బట్టి 2 శాతం నుంచి 5 శాతం వరకు మాజీ సైనికులకు కేటాయించాలి. కానీ.. ఇప్పటివరకు ఏ ఒక్కరికీ హౌసింగ్‌ బోర్డు కాలనీల్లో ఇళ్లను ఇవ్వలేదు. అమర సైనికుల భార్యలు, గాయపడిన సైనికులకు 300 చదరపు గజాల ఇళ్లస్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సి ఉండగా.. అందరికీ ఇవ్వలేదు. 


రిజర్వేషన్లు అంతంతే..!

రాష్ట్రంలో మాజీ సైనికులకు రిజర్వేషన్ల అమలూ అంతంతమాత్రంగానే ఉంది. తమకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను 2ు కేటాయిస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించారని, అయినా రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదని మాజీ సైనికులు చెబుతున్నారు. దానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల డీలర్‌షి్‌పలో ఒక శాతం, పారిశ్రామిక షెడ్డు/స్థలాల కేటాయింపులో 5ు, మాజీ సైనికుల పిల్లల ఎంబీబీఎస్‌ సీట్లలో 2ు రిజర్వేషన్లను అమలు చేయడం లేదని చెబుతున్నారు. ఈ సమస్యలపై వివరణ కోసం తెలంగాణ సైనిక సంక్షేమ విభాగ డైరెక్టర్‌ కల్నల్‌ రమేశ్‌ కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు ఫోన్‌లో సంప్రదించగా.. ఆయన స్పందించలేదు.


2015లో సైనికాధికారులతో సీఎం కేసీఆర్‌ ప్రత్యే క సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా 68 సమస్యలపై వారితో చర్చించారు. ఆ సమస్యల పరిష్కారానికి డీజీపీ అధ్యక్షతన ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఉత్తర్వుల ప్రకారం ఆరునెలలకోసారి కమిటీ సమావేశమవ్వాల్సి ఉండగా.. మూడేళ్లుగా కమిటీ సమావేశం నిర్వహించకపోవడం గమనార్హం. 2016 జనవరి, డిసెంబర్‌లో అప్పటి డీజీపీ అనురాగ్‌ శర్మ అధ్యక్షతన రెండు సమావేశాలు జరగగా.. ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 2018 జూన్‌లో ఒక సమావేశం మాత్రమే జరిగింది.


కేబినేట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలో సైనిక సంక్షేమం హామీలకే పరిమితమయింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఏ హామీనీ ప్రభుత్వం సరిగా నెరవేర్చలేదు. ఉత్తర్వుల ప్రకారం ఇళ్లస్థలాలను కేటాయించలేదు. సీఎం కేసీఆర్‌ అపాయిట్‌మెంట్‌ కోసం చాలాసార్లు ప్రయత్నించాం. సైనిక సమస్యలపై ప్రభుత్వం కేబినేట్‌ సబ్‌కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి. ఒక కొత్త విధానాన్ని రూపొందించాలి. సైనిక సంక్షేమ విభాగ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారిని నియమించాలి. 2015 నుంచి రాష్ట్రస్థాయి కమిటీ గడువును పొడిగిస్తూ వస్తున్నారు. ప్రజాస్వామ్యపద్ధతిన కొత్త వ్యక్తులకు కమిటీలో అవకాశం కల్పించాలి. 

 - రంగారెడ్డి రావుల, ఎక్స్‌సర్వీ్‌సమెన్‌ జేఏసీ
Updated Date - 2021-10-07T13:12:31+05:30 IST