బడికెళ్లాలా? వద్దా?

ABN , First Publish Date - 2021-03-24T16:00:40+05:30 IST

విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులన్నీ బుధవారం నుంచి బంద్‌ అని ప్రకటించిన ప్రభుత్వం.. ఉపాధ్యాయుల హాజరు విషయంలో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి ప్రకటన అనంతరం ఉపాధ్యాయ వర్గాల్లో ఈ అంశంపైనే చర్చ జరిగింది

బడికెళ్లాలా? వద్దా?

ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో సందిగ్ధం

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులన్నీ బుధవారం నుంచి బంద్‌ అని ప్రకటించిన ప్రభుత్వం.. ఉపాధ్యాయుల హాజరు విషయంలో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి ప్రకటన అనంతరం ఉపాధ్యాయ వర్గాల్లో ఈ అంశంపైనే చర్చ జరిగింది. అయితే ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వుల్లో దీని గురించి ప్రస్తావన ఉంటుందని భావించారు. కానీ.. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ విడుదలచేసిన జీవో (ఎంఎస్‌ నంబర్‌-67)లోనూ దీని ప్రస్తావన లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విద్యాశాఖ ఉన్నతాధికారులను సంప్రదించినా ఎలాంటి సమాధానం రాలేదు. ప్రత్యక్ష పాఠాలు లేకపోయినా ఉపాధ్యాయులందరూ విధిగా హాజరు కావాలని గత ఏడాది సెప్టెంబరులో ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. సగం మంది చొప్పున రావాలని మినహాయింపు ఇచ్చింది. ఈసారి ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో అన్న విషయంపై ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ విద్యాసంవత్సరం ముగిసేందుకు మరో 46రోజులు మాత్రమే ఉన్నందున ఉపాధ్యాయులను బడులకు రప్పించడమే మేలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయంపై బుధవారం స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. 

Updated Date - 2021-03-24T16:00:40+05:30 IST