తరగతి గదిలో కొట్టుకున్న అధ్యాపకులు
ABN , First Publish Date - 2021-02-26T16:31:47+05:30 IST
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, క్రమశిక్షణలో పెట్టాల్సిన అధ్యాపకులే విచక్షణ మరిచి తరగతి గదిలో వారి ముందే బాహాబాహీకి దిగారు. తూర్పు

ఇద్దరికీ గాయాలు, ఆస్పత్రికి తరలింపు
అనపర్తి, ఫిబ్రవరి 25: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, క్రమశిక్షణలో పెట్టాల్సిన అధ్యాపకులే విచక్షణ మరిచి తరగతి గదిలో వారి ముందే బాహాబాహీకి దిగారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శివారు కొత్తూరులోని డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ ఇంగ్లిషు మీడియం గురుకుల జూనియర్ కళాశాలలో వెంకటేశ్వరరావు ఎనిమిది సంవత్సరాలుగా పార్ట్‌టైమ్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం వెంకటేశ్వరరావుతో పాటు కొంత మంది పార్ట్‌టైమ్ అధ్యాపకులు టెట్ పరీక్షలకు హాజరుకాలేదని ఇన్‌చార్జి ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావుతో పాటు మరో అధ్యాపకుడిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వరావు, శ్రీనివాసరావు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కళాశాలలో జరుగుతున్న కొన్ని విషయాలను వెంకటేశ్వరరావు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు శ్రీనివాసరావును వివరణ కోరారు. ఈ నేపథ్యంలో గురువారం వారిద్దరూ తరగతి గదిలోనే ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. గాయాలపాలైన వీరిని విద్యార్థులు, సహచర అధ్యాపకులు విడదీసి అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డీసీవో మురళీకృష్ణ అక్కడకు వచ్చి విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.