వివరాలు చెప్పకుండా ఆప్షన్లు ఎలా ఇస్తాం.. ఉపాధ్యాయుల నిలదీత

ABN , First Publish Date - 2021-12-28T20:25:28+05:30 IST

రంగారెడ్డి జిల్లా అధికారులు చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ఆందోళనకు దారి తీసింది. సరైన సమాచారం లేకుండానే ఆప్షన్లు ఇవ్వాలని చెప్పడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు

వివరాలు చెప్పకుండా ఆప్షన్లు ఎలా ఇస్తాం.. ఉపాధ్యాయుల నిలదీత

హైదరాబాద్ సిటీ/ఎల్‌బీనగర్‌ : రంగారెడ్డి జిల్లా అధికారులు చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ఆందోళనకు దారి తీసింది. సరైన సమాచారం లేకుండానే ఆప్షన్లు ఇవ్వాలని చెప్పడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. తొలుత ఎల్‌బీనగర్‌ బహదూర్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బైఠాయించిన ఉపాధ్యాయులు అనంతరం ఎల్‌బీనగర్‌ ప్రధాన రహదారిపైకి చేరుకుని ధర్నాకు దిగారు. దీంతో వెనక్కి తగ్గినట్లే కనిపించిన విద్యాశాఖాధికారులు ఆప్షన్లు ఇవ్వాల్సిందే అని సాయంత్రం సమాచారం ఇవ్వడంతో సొంత ప్రాంతాలకు వెళ్లిన ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.


సీనియారిటీ లిస్టు, ఖాళీల వివరాలు వెల్లడించకుండానే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించడాన్ని ఉపాధ్యాయులు తప్పుబడుతున్నారు. వివరాలు చెప్పకుండా ఆప్షన్లు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన దాదాపు 2300 మంది ఉపాధ్యాయులు ఒక్కరోజులోనే ఆప్షన్లు ఎలా ఇస్తారని అధికారులను నిలదీశారు. జీఓ 317 ప్రకారం ఆయా ప్రాంతాల ఉపాధ్యాయులను అక్కడి పాఠశాలలకే కేటాయించాలన్నారు. అధికారుల హామీతో  ఆందోళన విరమించి తమ ప్రాంతాలకు వెళ్లిన ఉపాధ్యాయులను సాయంత్రం మళ్లీ ఆప్షన్లు ఇవ్వాలని ఎలా అడుగుతారని ఉపాధ్యాయ సంఘం నాయకుడు పాండురంగారెడ్డి ప్రశ్నించారు.


ఖాళీలు, సీనియారిటీ లిస్టు ప్రకటించాలన్నారు. అప్పుడే ఉపాధ్యాయులు ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యాశాఖాధికారులు జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఉన్న ఖాళీలు చూపించడం లేదని ఆయన ఆరోపించారు. పాఠశాలలను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తోందని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీలను ప్రకటించిన తర్వాతే బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాఽధ్యాయ సంఘాల నాయకులు ప్రవీణ్‌, పాండురంగారెడ్డి (ఎస్‌టీయూ), గోవర్ధన్‌ (పీఆర్‌టీయూ), రామచంద్రయ్య (యూటీఎఫ్‌), తిరుమలేష్‌ (టీయూటీఎఫ్‌), సాబెర్‌, సిద్ధార్థ్‌ (పీఈటీ అసోసియేషన్‌) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-28T20:25:28+05:30 IST