చదువు.. పెండింగ్‌

ABN , First Publish Date - 2021-08-10T16:13:34+05:30 IST

సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై నాన్చుడు ధోరణి.. అత్యంత కీలక విషయాల్లోనూ స్పష్టత లేమి.. దేనికైనా ఉన్నతాధికారుల ఆదేశాలకు ఎదురుచూపు.. చివరకు ఏ సంగతీ తేలకుండానే గడిచిపోతున్న రోజులు..!

చదువు.. పెండింగ్‌


పైవారిదే ‘నిర్ణయం’!.. దేనికైనా వారి ఆదేశాలు రావాల్సిందే

సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరీక్షలపైనా జాప్యం

బడుల ప్రారంభం, ఉపాధ్యాయుల పదోన్నతులు పెండింగ్‌

సీఎస్‌ లేదా సీఎంవో అనుమతి ఉంటేనే ఫైళ్లకు కదలిక

విద్యా శాఖలో విచిత్రమిది.. లక్షలాది విద్యార్థులపై ప్రభావం


హైదరాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై నాన్చుడు ధోరణి.. అత్యంత కీలక విషయాల్లోనూ స్పష్టత లేమి.. దేనికైనా ఉన్నతాధికారుల ఆదేశాలకు ఎదురుచూపు.. చివరకు ఏ సంగతీ తేలకుండానే గడిచిపోతున్న రోజులు..! ఇదీ విద్యాశాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా సీఎం కార్యాలయం నుంచి అనుమతి వస్తే కానీ ముందుకెళ్లలేని వాతావరణం ఉంది. అయితే, ఈ మేరకు వారి నుంచి ఆదేశాలు, సూచనల రాకలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులపై పడుతోంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, పాఠశాలల ప్రారంభం, ఇంటర్‌ పరీక్షలు, తరగతుల ప్రారంభం, ప్రైవేట్‌ టీచర్లకు కొవిడ్‌ సాయం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు నుంచి కీలకమైన ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ వరకు అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.


కీలక పరీక్షలపై నిర్ణయానికి నిరీక్షణ

పరీక్షల విషయంలో ఆలస్యమయ్యే కొద్దీ షెడ్యూల్‌లో ఇబ్బంది ఎదురవుతుంది. తర్వాత ప్రయోజనం ఉండదు. ఇలాంటివాటిపైనా నిరీక్షించాల్సి వస్తోంది. కరోనాతో రెండేళ్ల నుంచి పరీక్షలు వాయిదా పడుతున్నాయి. గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాయకుండానే విద్యార్థులను పాస్‌ చేశారు. వీరు ఇంటర్‌ మొదటి సంవత్సరం కూడా ఇలానే గట్టెక్కారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో ఉన్నారు. భవిష్యత్తులో కరోనా విజృంభిస్తే.. వీరికి పరీక్షలను నిర్వహించడానికి సాధ్యం కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే భవిష్యత్‌లో ఉన్నత విద్యకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మొదటి ఏడాది పరీక్షలను నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు జూలైలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. ప్రభుత్వ పెద్దల నుంచి అనుమతి రాకపోవడంతో బోర్డు అధికారులకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇక ఫస్ట్‌ ఇయర్‌ తరగతుల నిర్వహణ విషయంలోనూ నిర్ణయానికి రాలేకపోతున్నారు. మరోపక్క ప్రైవేట్‌ కళాశాలల్లో తరగతులు మొదలుపెట్టారు. ఇది ప్రభుత్వ కళాశాలల వారికి ఇబ్బందికరం. 


ముందడుగు లేని మౌలిక వసతుల కల్పన

ఏడాదికి సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసేలా పాఠశాలల ఆధునికీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందుకోసం అధికారుల బృందం ఏపీ, ఢిల్లీ వెళ్లి పరిశీలించి వచ్చింది. విద్యా సంవత్సరం మొదలైనప్పటికీ దీని ఆధారంగా చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వ స్థాయిలో ముందడుగు పడలేదు. ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ, పదోన్నతులు, భర్తీలపై చాలాకాలం నుంచి అనుకుంటున్నా ఇప్పటికీ మార్గదర్శకాలు వెలువడలేదు. రాష్ట్రంలో 15 వేలకుపైగా టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలంటే ముందుగా రేషనలైజేషన్‌, పదోన్నతులు చేపట్టాలి. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. అలాగే, ఈ విద్యా సంవత్సర క్యాలెండర్‌ను ప్రకటించలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే ఆలోచిస్తామని అధికారులు అంటున్నారు.


ప్రైవేటు టీచర్లకు అందని సాయం

పాఠశాలలు ప్రారంభమయ్యేదాకా ప్రైవేట్‌ టీచర్లకు నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో వీటిని చెల్లించారు. జూలై నుంచి ఇవ్వడం లేదు. దీనిపై విద్యాశాఖ అధికారులకు సమాచారం లేదు.


పాఠశాలల పునఃప్రారంభం సంగతేంటి?

ఐసీఎంఆర్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌తో పాటు, పార్లమెంటరీ కమిటీ కూడా పాఠశాలలను ప్రారంభించుకోవచ్చని పేర్కొన్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అయితే.. ఈ విషయంలో విద్యా శాఖ ఉన్నతాధికారులకే స్పష్టత లేదు. సీఎం స్థాయిలోనే నిర్ణయం జరగాలని వారు భావిస్తున్నారు. అటు సీఎం కార్యాలయ అధికారులు కూడా విద్యా శాఖ అఽధికారులకు సూచనలు చేయడం లేదు. దాంతో చర్యలు మొదలుపెట్టలేదు.


ఆ ఇద్దరి అనుమతి ఉంటేనే..

విద్యా శాఖలో ఏ నిర్ణయం జరగాలన్నా సీఎస్‌ లేదా సీఎం కార్యాలయంలోని కీలక అధికారి అనుమతి తప్పనిసరిగా ఉండాలన్న ప్రచారం సాగుతోంది. వీరు ఫైళ్లు చూడడం కానీ, చర్చించడానికి సంబంధిత అధికారికి సమయమివ్వడం కానీ సాఽధ్యంకావడం లేదు. తద్వారా అనేక విషయాల్లో ఏ నిర్ణయం తీసుకోవడం లేదన్న అభిప్రాయాలున్నాయి. కొన్ని ఫైళ్ల విషయంలోనూ ప్రభుత్వ పెద్దల నుంచి విచిత్రమైన స్పందన వస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక అంశపై 15వ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఆ ఫైల్‌ ను 17న పరిశీలించనున్నారు. సంతకంలో మాత్రం 15కంటే ముందు తేదీని వేసి.. ‘‘డిస్కస్‌’’ అంటూ వెనక్కు పంపుతున్నట్టు తెలిసింది.


Updated Date - 2021-08-10T16:13:34+05:30 IST