విద్యార్థులకు గమనిక: ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు కావాలంటే.. ఈ ఈ-మెయిల్ అడ్రస్‌కు మీ వివరాలు పంపించండి..!
ABN , First Publish Date - 2021-10-28T14:34:46+05:30 IST
ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను..

పేద పిల్లలకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఇవ్వండి
ఐటీ, కార్పొరేట్ కంపెనీలకు గవర్నర్ పిలుపు
పేద విద్యార్థులు అభ్యర్థనలు పంపాలని సూచన
హైదరాబాద్: రాష్ట్రంలోని ఐటీ, కార్పొరేట్ కంపెనీలు వినియోగించి పక్కనపెట్టిన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు అందజేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం పిలుపునిచ్చారు. కొవిడ్ నేపథ్యంలో కొనసాగుతున్న ఆన్లైన్ తరగతులకు చాలామంది పేద, బడుగు బలహీనవర్గాల విద్యార్థులు దూరమవుతున్నారన్నారు. ఇలాంటి వారు ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేయలేరని, దాతలే వారికి అండగా నిలవాలని సూచించారు. ఇప్పటికీ చాలామంది పేద విద్యార్థులకు ఇలాంటి డిజిటల్ గాడ్జెట్లు అవసరమున్నాయని తెలిపారు.
ఐటీ, కార్పొరేట్ కంపెనీలు, ఇతర సంస్థల వద్ద వినియోగించి పక్కన పెట్టిన చాలా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఉంటాయని, బాగున్న వాటిని రాజ్‌భవన్‌లో అందజేస్తే వీటిని పేద విద్యార్థులకు అందజేస్తామన్నారు. వీటిని అందించాలనుకునే సంస్థలు రాజ్‌భవన్‌లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కో-ఆర్డినేటర్ కె.అమర్నాథ్(ఫోన్ నంబర్ 9490000242) ను సంప్రదించాలని సూచించారు. ఈ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అవసరమున్న విద్యార్థులు కూడా rajbhavan-hyd@gov.in అనే ఈ-మెయిల్ అడ్రస్‌కు పేరు, చిరునామా తదితర వివరాలు పంపించాలని తెలిపారు.
