స్కూళ్లు, కాలేజీల్లో అధిక ఫీజులు అడిగితే ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

ABN , First Publish Date - 2021-08-27T14:20:18+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల అంశాన్ని 20ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో విద్య వ్యాపారంగా మారిపోయిందని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ అభిప్రాయపడింది. తల్లిదండ్రులకు ఊరట

స్కూళ్లు, కాలేజీల్లో అధిక ఫీజులు అడిగితే ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు 

నిర్ధారించిన ఫీజే కడతామని తల్లిదండ్రులు చెప్పాలి 

అంతకుమించి అడిగితే 9150381111కు ఫోన్‌ చేయండి 

వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం 

అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం

పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ 

అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల అంశాన్ని 20ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో విద్య వ్యాపారంగా మారిపోయిందని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ అభిప్రాయపడింది. తల్లిదండ్రులకు ఊరటనిచ్చే లక్ష్యంతో ప్రైవేటు బడులు, ఇంటర్‌ కళాశాలల్లో ఫీజులను నిర్ణయించామని పేర్కొంది. ఎవరైనా అంతకుమించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిర్ధారించిన మొత్తం కంటే ఇప్పటికే ఎక్కువగా వసూలు చేసిఉంటే వాటిని మిగతా కాలానికి సర్దుబాటు చేస్తామని, అప్పటికీ ఎక్కువగా ఉంటే తిరిగి వెనక్కు ఇప్పిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేటు పాఠశాల, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు నిర్ణయించామని తెలిపింది. 


ఆయా విద్యాసంస్థలకు నిర్ధారించిన ఫీజు మాత్రమే కడతామని తల్లిదండ్రులు చెప్పాలని, అంతకుమించి అడిగితే 9150381111కు ఫోన్‌ చేస్తే వారం రోజుల్లో సమస్యను పరిష్కారిస్తామని పేర్కొంది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు, కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి, ఉప చైర్మన్‌ విజయసారథిరెడ్డి, కార్యదర్శి అజయ్‌కుమార్‌ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జస్టిస్‌ కాంతారావు మాట్లాడుతూ... ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై జీవో.53, ఇంటర్‌ కళాశాలల్లో ఫీజులపై జీవో.54 ఇటీవల జారీ చేశామన్నారు. పలు కళాశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి ఫీజులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చామన్నారు. పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటాను అమలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని జస్టిస్‌ కాంతారావు పేర్కొన్నారు. 


పాఠశాలు, కాలేజీలకు ర్యాంకులు 

కమిషన్‌ నిర్ణయించిన ఫీజులు 80శాతం కళాశాలలకు ఆమోదయోగ్యంగానే ఉన్నాయని కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు. విద్య వ్యాపారం కాకూడదన్న ముఖ్యమంత్రి జగన్‌ సూచన మేరకు, పాఠశాలల మనుగడకు ఇబ్బంది లేకుండానే ఫీజులను నిర్ణయించామన్నారు. ఒకవేళ కొన్ని పాఠశాలలు తాము అత్యధిక ప్రమాణాలతో బోధన చేస్తున్నామని భావిస్తే తమకు దరఖాస్తు చేసుకోవచ్చని, అన్నీ పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేటు బడులు, ఇంటర్‌ కళాశాలల ప్రమాణాలను బట్టి రాబోయే రోజుల్లో వాటికి ర్యాంకులు కూడా ఇస్తామన్నారు. కొవిడ్‌ సమయంలో కొన్ని విద్యాసంస్థలు ఉపాధ్యాయులకు జీతాలు కూడా చెల్లించలేదన్నారు. టీచర్లకు నియామకపత్రాలే లేవన్నారు. ఇప్పుడు పాఠశాలలు వాటిని కూడా ఇవ్వాలని, దీంతో వారికీ న్యాయం జరుగుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలలు కొనసాగాలని, అయితే ఫీజుల విషయంలో న్యాయబద్ధంగా ఉండాలన్నదే కమిషన్‌ లక్ష్యమని సాంబశివారెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-27T14:20:18+05:30 IST