నాడు భర్త.. నేడు అతడి భార్య..
ABN , First Publish Date - 2021-11-26T13:56:40+05:30 IST
నాడు భర్త..

నిరుద్యోగం.. నిండు ప్రాణాలు తీసింది!
నాలుగు నెలల వ్యవధిలో భార్యాభర్తల విషాదాంతం
జమ్మికుంట: షబ్బీర్.. ప్రభుత్వ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చూసి విరక్తి చెంది, భార్యను పోషించుకోలేక పోతున్నానని కలత చెంది నాలుగు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి.. ఆ కుటుంబానికి నాడు ఆర్థిక సాయం కూడా అందించారు. కానీ, ఆ సాయం.. అతడి భార్య మనసుకు తగిలిన గాయాన్ని మాత్రం మాన్పలేకపోయింది. అతడ్ని విడిచి ఉండలేక.. ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్, జమ్మికుంట అంబేడ్కర్ కాలనీకి చెందిన రేష్మ (26) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
షబ్బీర్.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ.. భార్యను పోషించుకునేవాడు. ఇంతలో కరోనా రావడంతో.. అది కాస్తా పోయింది. దీంతో.. ఇద్దరూ తిరిగి జమ్మికుంట చేరారు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఉద్యోగం రాకపోవడం, ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లూ లేకపోవడంతో.. కుంగిపోయిన షబ్బీర్.. ఈ మేరకు లేఖ రాసిపెట్టి.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి తండ్రి ఇంట్లోనే ఉంటున్న రేష్మ.. బుధవారం ఉరేసుకుంది.