టీఆర్‌ఎస్‌లోకి సిద్దిపేట కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-11-16T14:36:49+05:30 IST

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి అధికార..

టీఆర్‌ఎస్‌లోకి సిద్దిపేట కలెక్టర్‌

వెంకట్రామారెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ.. 

రిటైర్మెంట్‌కు 10 నెలల ముందే వీఆర్‌ఎస్‌

వెంటనే ఆమోదిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు.. 

త్వరలో అధికార పార్టీలో చేరతానని ప్రకటన

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం, 

రెవెన్యూ మంత్రి పదవి హామీ ఇచ్చిన కేసీఆర్‌!

సీఎంను ఫాంహౌస్‌లో కలిసిన వెంకట్రామారెడ్డి.. 

గతంలో ఆయనకు పాదాభివందనం

వరి సాగు చేయొద్దన్న వ్యాఖ్యలతో దుమారం


హైదరాబాద్‌/సిద్దిపేట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి అధికార టీఆర్‌ఎ్‌సలో చేరనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేశారు. తన వీఆర్‌ఎ్‌సను ఆమోదించాలంటూ సోమవారం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి లేఖ అందించారు. ప్రభుత్వం కూడా అంతే వేగంగా ఆయన వీఆర్‌ఎ్‌సను ఆమోదించింది. సోమవారం నుంచే వెంకట్రామారెడ్డి వీఆర్‌ఎస్‌ అమల్లోకి వచ్చినట్లు సీఎస్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి 2022 సెప్టెంబరులో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, మరో 10 నెలల సర్వీసు మిగిలి ఉండగానే.. వైదొలగారు. అయితే తాను త్వరలో టీఆర్‌ఎ్‌సలో చేరనున్నట్లు వెంకట్రామారెడ్డి ప్రకటించారు. ఆయనను ఎమ్మెల్సీని చేసి, రెవెన్యూ శాఖ మంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్‌ వెంకట్రామారెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌ్‌సలో సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు, దాదాపు నాలుగు గంటలపాటు సీఎంతో జరిపిన చర్చలో ఈ మేరకు హామీ లభించినట్లు తెలిసింది. వాస్తవానికి రాజకీయ రంగ ప్రవేశం కోసం వెంకట్రామారెడ్డి మూడేళ్లుగా వేచి చూస్తున్నారు. తన కుటుంబసభ్యులు నిర్మాణ రంగంలో ఆర్థికంగా నిలదొక్కుకుని బిల్డర్స్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను ఐఏఎస్‌ పదవిని వదిలిపెట్టి రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఆశించగా నిరాశ ఎదురైంది. ఆ తరువాత 2019లో మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి, 2020లో దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి పేరు హల్‌చల్‌ చేసింది. చివరికి మూడేళ్ల అనంతరం సీఎం కేసీఆర్‌ నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది. 


ప్రశంసలు.. వివాదాలు

సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామారెడ్డి ఐదేళ్లపాటు సుదీర్ఘంగా పనిచేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కొద్దిరోజుల పాటు సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ సిద్దిపేటకు వచ్చారు. కేసీఆర్‌ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటతోపాటు సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ అభివృద్ధిలో వెంకట్రామారెడ్డి పాత్ర కీలకం. సీఎం కేసీఆర్‌ సైతం పలు సమావేశాల్లో ఆయనను ప్రశంసించారు. అయితే ఆయనను వివాదాలు సైతం అదే స్థాయిలో చుట్టుముట్టాయి. సిద్దిపేట నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంలో సీఎం కేసీఆర్‌కు వెంకట్రామారెడ్డి పాదాభివందనం చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో వరి పంటను సాగు చేయవద్దని, విత్తన సంస్థలు వరి విత్తనాలను విక్రయించవద్దని ఆయన చేసిన హెచ్చరికలు పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి లిఖిత పూర్వక ఉత్తర్వులు వెలువడకపోయినా.. జిల్లా కలెక్టర్‌ ఇలాంటి హెచ్చరికలు చేయడమేంటని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వెంకట్రామారెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ అంతకుముందు ఆరోపణలు చేశారు. హుడా సెక్రటరీగా ఉన్నప్పుడు ఓఆర్‌ఆర్‌ను అష్టవంకర్లు తిప్పారని, రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 


త్వరలో టీఆర్‌ఎస్‌లోకి: వెంకట్రామారెడ్డి

త్వరలో తాను టీఆర్‌ఎ్‌సలో చేరుతానని, ఏ పదవి అప్పగించినా సీఎం కేసీఆర్‌ మార్గ నిర్దేశం ప్రకారం పని చేస్తానని వెంకట్రామారెడ్డి తెలిపారు.  సీఎ్‌సకు వీఆర్‌ఎస్‌ లేఖ అందించిన అనంతరం ఆయన బీఆర్కే భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘ కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోంది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రాన్ని కేసీఆర్‌ తీర్చిదిద్దుతున్నారు. ఈ అభివృద్ధి మార్గంలో సీఎంతో ఉండాలనుకుని వీఆర్‌ఎస్‌ తీసుకున్నాను’’ అని చెప్పారు. 


గ్రూప్‌-1 నుంచి ఐఏఎస్‌.. 

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రామారెడ్డి 1991లో గ్రూప్‌-1 ఆఫీసర్‌గా ఎంపికై ప్రభుత్వ సర్వీసులో చేరారు. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పని చేశారు. ఆ తర్వాత మెదక్‌ జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌గా, హుడా సెక్రటరీగా, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌గా, ఇన్‌క్యాప్‌ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. 2007లో తెలంగాణ కేడర్‌ ఐఏఎ్‌సగా ప్రమోట్‌ అయ్యారు. మెదక్‌ జిల్లా జేసీగా, సంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం సిద్దిపేట కలెక్టర్‌గా కొనసాగుతున్నారు.

Updated Date - 2021-11-16T14:36:49+05:30 IST