సీనియర్లకు ఒకలా.. జూనియర్లకు మరోలానా.. టీచర్ల బదిలీలపై తీవ్ర ఆందోళనలు

ABN , First Publish Date - 2021-12-28T16:58:06+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 317ను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా సీనియారిటీ జాబితాల్లో పొరపాట్లు దొర్లాయని, కౌన్సెలింగ్‌ను సరిగా చేయడం లేదని, అభ్యంతరాలను..

సీనియర్లకు ఒకలా.. జూనియర్లకు మరోలానా.. టీచర్ల బదిలీలపై తీవ్ర ఆందోళనలు

టీచర్లకు స్థానికత లేకుండా చేశారు.. ఉద్యోగ బదిలీల్లో తీవ్ర అన్యాయం

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన 

ఇంటర్‌ బోర్డు ముందు జేఏసీ నిరసన

28న సచివాలయ ముట్టడి: కమిటీ


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 317ను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా సీనియారిటీ జాబితాల్లో పొరపాట్లు దొర్లాయని, కౌన్సెలింగ్‌ను సరిగా చేయడం లేదని, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఉపాధ్యాయుల కేటాయింపుల్లో సీనియారిటీ జాబితాలో జరిగిన తప్పులను సవరించాలని కామారెడ్డి కలెక్టరేట్‌ వద్ద నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ధర్నా చేశారు.


317జీవో ద్వారా తమకు స్థానికత లేకుండా చేశారని.. నిజామాబాద్‌ నుంచి కామారెడ్డి జిల్లాకు దాదాపు 600 మందికి పైగా టీచర్లను బలవంతంగా పంపించారని అన్నారు. సీనియర్లకు మంచి స్థానాలను కేటాయించి జూనియర్లకు మారుమూల ప్రాంతాలను ఇచ్చారని ఆరోపించారు. 317 జీవోను రద్దు చేయాలని నిర్మల్‌లో ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించారు. 317 జీవో రాజ్యాంగ విరుద్ధమని తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లా అంతటా సోమవారం పాక్షిక బంద్‌ కొనసాగింది. జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ అధ్యాపకులను ఇష్టమొచ్చినట్లు కేటాయిస్తున్నారని ఇంటర్‌ విద్య జేఏసీ ఆధ్వర్యంలో ఇంటర్‌ బోర్డు ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాన్‌ లోకల్‌ అభ్యర్థులు 5 శాతం మించి ఉద్యోగాలు పొందడానికి అవకాశం లేనప్పటికీ, దానికి భిన్నంగా కేటాయింపులను జరుపుతున్నారని ఆరోపించారు. 317 జీవోను రద్దు చేసి ఖాళీగా ఉన్న 75 శాతం పోస్టులను నిరుద్యోగ యువతతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఉపాధ్యాయులు పాఠశాలలను ఎంపిక చేసుకునే విషయంలో ప్రభుత్వం ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ను రద్దు చేసి, వెబ్‌ కౌన్సెలింగ్‌ను చేపట్టడం పట్ల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్షన్‌ ఫాం అవసరం లేదని చెప్పిన అధికారులు.. సోమవారం రాత్రి వరకు వాటిని సమర్పించాలని ఆదేశించడం సరికాదని పేర్కొంది. ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 28న సచివాలయ ముట్టడి చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయించింది.

కమిషన్‌ వేయాలి: ఆర్‌.కృష్ణయ్య 
ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు పారదర్శకంగా జరిగేలా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కమిషన్‌ వేయాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం కాచిగూడలోని అభినందన్‌ గ్రాండ్‌ హోటల్‌లో నిర్వహించిన బీసీ ఉద్యోగుల సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. సీఎస్‌, మంత్రులు, కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు కుమ్మక్కై.. బదిలీలు, ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 317 జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్‌ చేశారు.

బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ వివక్ష చూపిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ ఆరోపించారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బదిలీల్లో జరుగుతున్న అన్యాయంపై జాజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ బీసీ కమిషన్‌ దిల్‌కుషా అతిథి గృహంలో సోమవారం విచారణ చేపట్టింది. జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారికి జాజుల వినతి పత్రం అందజేశారు. ఏకపక్షంగా జీవో 317 తెచ్చారని విమర్శించారు. స్థానికత, సీనియారిటీ పేరుతో బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులను పక్క జిల్లాలకు బదిలీ చేస్తున్నారని తెలిపారు.

న్యాయ పోరాటం చేస్తాం
జిల్లా, జోన్‌, మల్టీజోన్‌ కేటాయింపులు చేయడం వల్ల తాము స్థానికత కోల్పోతున్నామని పంచాయతీ కార్యదర్శుల సంఘం ఒక ప్రకటనలో ఆరోపించింది. గ్రేడ్‌-1, 2, 3జోనల్‌ పోస్టులకు సంబంధించి కేటాయింపులు చేస్తూ మొబైల్‌ సందేశంలో ఉత్తర్వులు వచ్చాయని, మూడు రోజుల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నట్లు తెలిపింది. ఇది జోనల్‌ స్ఫూర్తికి విరుద్ధమని, స్థానికత కోల్పోయిన పంచాయతీ కార్యదర్శులతో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని పేర్కొంది.

Updated Date - 2021-12-28T16:58:06+05:30 IST