ఆగస్టు 16 నుంచి బడులు
ABN , First Publish Date - 2021-07-08T16:02:18+05:30 IST
రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తారు. టెన్త్ మార్కులకు 30 శాతం, ఇంటర్ మొదటి సంవత్సరం మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి ఇంటర్ రెండో ఏడాది మార్కులను ఖరారు చేస్తారు

ఈ నెల 12నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం
ఆగస్టులో విద్యాకానుక, నాడు-నేడు రెండో విడత
నూతన విద్యావిధానం కచ్చితంగా అమలు చేస్తాం
టెన్త్, ఇంటర్ ఫస్టియర్ మార్కులు ప్రాతిపదికగా ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులకు మార్కులు
నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తారు. టెన్త్ మార్కులకు 30 శాతం, ఇంటర్ మొదటి సంవత్సరం మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి ఇంటర్ రెండో ఏడాది మార్కులను ఖరారు చేస్తారు. ఈ నెలాఖరులోపు విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేయనున్నారు. ‘నాడు-నేడు’ కార్యక్రమంపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 16న పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసేందు కు కార్యాచరణ రూ పొందించాలని నిర్దేశించారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్‌బుక్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో బోధన ఉంటుందన్నారు. పదో తరగతిలో టాప్ 3 సబ్జెక్టులకు 30శాతం మార్కులు, ఇంటర్ మొదటి ఏడాది సబ్జెక్టుల వారీ మార్కులకు 70శాతం చొప్పున... ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని, రెండో ఏడాది ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయినందున వాటినే మదింపు చేసి మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. సమీక్షలో భాగంగా నూతన విద్యావిధానం అమలుపై సీఎంకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
దీనికోసం 21,654 కొత్త తరగతి గదులు అవసరమని అధికారులు చెప్పగా... అందుకు అవసరమైన నిధులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. మొదటి విడత నాడు-నేడు పనులు ఆగస్టు నాటికల్లా పూర్తికావాలని నిర్దేశించారు. పనులు పూర్తయిన బడులను ఆ నెలలో జాతికి అంకితం చేస్తామన్నారు. అదేనెలలో విద్యాకానుక, రెండో విడత నాడు-నేడు పనులు ప్రారంభించాలన్నారు. వచ్చే మార్చి నెలాఖరు కల్లా రెండో విడత నాడు-నేడు పూర్తిచేయాలన్నారు. విద్యాకానుకలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ టు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఆగస్టులో విద్యాకానుక అందించేందుకు సన్నద్ధమవ్వాలన్నారు. ఈ సమీక్షకు పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.