విద్యా సంస్థలు బంద్‌

ABN , First Publish Date - 2021-03-24T16:55:11+05:30 IST

విద్యా సంస్థలు మళ్లీ మూతబడ్డాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో విద్యా సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శాసనసభలో ఈ మేరకు ప్రకటన చేశారు.

విద్యా సంస్థలు బంద్‌

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూసివేత

పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలు సైతం

వైద్య కళాశాలలకు మినహాయింపు

ఆన్‌లైన్‌ తరగతుల కొనసాగింపు

పొరుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి

బడుల్లోనూ చెదురుమదురు కేసులు 

కొనసాగితే విస్ఫోటంగా మారే చాన్స్‌

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మూసివేత

విద్యార్థులు, టీచర్ల శ్రేయస్సు కోసమే

అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి


హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): విద్యా సంస్థలు మళ్లీ మూతబడ్డాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో విద్యా సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శాసనసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. వైద్య కళాశాలలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ‘‘దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. దాంతో, కరోనా విస్ఫోటంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే యూపీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయి’’ అని వివరించారు. రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంపై ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు.


ప్రస్తుత పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించాక, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ ఈనెల 24 నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి, రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయని చెప్పారు. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర ప్రజానీకమంతా సహకరించాలని కోరారు. విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్‌ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-24T16:55:11+05:30 IST