ఎయిడెడ్‌ టీచర్ల విలీనానికి షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-10-19T15:38:30+05:30 IST

Schedule for Merger of Aided Teachers..

ఎయిడెడ్‌ టీచర్ల విలీనానికి షెడ్యూల్‌

నవంబరు 7నాటికి ప్రక్రియ పూర్తి


అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీల్లో నియమించి విలీన ప్రక్రియను ముగించేందుకు ప్రభుత్వం షెడ్యూలు ప్రకటించింది. ఎయిడెడ్‌ పాఠశాలలకు సాయం ఆపేసి, అక్కడి ఉపాధ్యాయులను ప్రభుత్వంలో విలీనం చేసి.. ఆయా పాఠశాలలను ప్రైవేటుగా మార్చాలన్న నిర్ణయంపై ఎంత వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం ముందుకే వెళ్లింది. ఇప్పటికే ఎయిడెడ్‌ టీచర్లను జిల్లా విద్యాశాఖాఽధికారులకు రిపోర్ట్‌ చేయాలంది. వారంతా రిపోర్ట్‌ చేశారు. ఇక, ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీలు ఎన్ని? వారిని ఎక్కడెక్కడ నియమించాలన్న షెడ్యూలు కూడా సోమవారం పాఠశాల విద్య డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు విడుదల చేశారు. విలీనమయ్యే ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను ఈనెల 20న రూపొందించి 22న ఖరారుచేస్తారు. వాటిని 23న జిల్లా స్థాయిలో ప్రదర్శిస్తారు. 24నుంచి 27వరకు వాటిపై అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. 31నాటికి అభ్యంతరాలు పరిష్కరించి జాబితాలు ఖరారుచేస్తారు. నవంబరు ఒకటో తేదీన పాఠశాలల వారీగా ఉన్న ఖాళీల వివరాలు ఇచ్చి ఆన్‌లైన్‌లో పెడతారు.


నవంబరు 2 నుంచి 5వరకు ఉపాధ్యాయులు తాము కావాలనుకున్న పాఠశాలల ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఆరో తేదీన అలాట్‌మెంట్‌ ఉత్తర్వులిస్తారు. ఏడో తేదీన ఆయా పాఠశాల్లో ఉపాధ్యాయులు చేరాలి. దీంతో విలీన ప్రక్రియ ముగుస్తుంది. మరోవైపు ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రైవేటుగా మారిపోతున్నందున.. అక్కడి విద్యార్థులను తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు దగ్గరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఒక ప్రణాళిక రూపొందించి ఈ నెలాఖరుకు నాటికి ఆ ప్రక్రియ పూర్తిచేస్తారు. 

Updated Date - 2021-10-19T15:38:30+05:30 IST