AP: ‘అమరావతి’ పాఠ్యాంశం తొలగింపు

ABN , First Publish Date - 2021-10-07T14:26:20+05:30 IST

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని....

AP: ‘అమరావతి’ పాఠ్యాంశం తొలగింపు

పదో తరగతి తెలుగులో రెండో పాఠం

ఈ ఏడాది కొత్త పుస్తకాల నుంచి తొలగింపు 

ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు


అమరావతి/విజయవాడ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిని.. అన్ని కోణాల్లోనూ అణిచి వేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా అమరావతి విశేషాలు... రాజధాని ప్రాశస్త్యం... వంటి వాటిని విద్యార్థి దశ నుంచే నేటి తరానికి వివరించేలా రూపొందించిన అమరావతి పాఠ్యాంశాన్ని సైతం తొలగించింది. పదో తరగతి తెలుగు వాచకంలో ‘అమరావతి’ని ఒక పాఠ్యాంశంగా పొందుపరిచారు. దీనిలో అమరావతి ప్రాశస్త్యం.. నాడు అక్కడ విలసిల్లిన బౌద్ధ, జైన మత సంస్కృతి, శిల్ప సంపదల నుంచి.. నేటి రాజధాని వరకు ఉన్న అంశాలను వివరించారు. పదో తరగతి తెలుగు వాచకంలో మొత్తం 12 పాఠ్యాంశాలు ఉంటే అమరావతిని రెండో అంశంగా చేర్చారు. తాజాగా ఈ ఏడాది ముద్రించిన కొత్త తెలుగు పుస్తకాల్లో ఈ పాఠ్యాంశాన్ని తీసేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.


వాస్తవానికి అమరావతి అనేది ఇప్పటికిప్పుడు ప్రసిద్ధి చెందింది కాదు. శాతవాహనుల కాలంలో ఈ ప్రాంతం రాజధానిగా ఉండేది. ధాన్యకటకం లేదా ధరణికోటగా పిలిచేవారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతి ఇది. బుద్ధుడు స్వయంగా వచ్చాడని, ఆయన పాదస్పర్శతో అమరావతి పునీతమైందని బౌద్ధులు విశ్వసిస్తారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న అమరావతి పాఠ్యాంశాన్ని వైసీపీ ప్రభుత్వం తొలగించడం దారుణమని పలువురు దుయ్యబడుతున్నారు. 


పాఠం తొలగింపుపై టీడీపీ ఆగ్రహం

తెలుగు వాచకం నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించడంపై టీడీపీ, సీపీఐ, అమరావతి బహుజన జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించి, అమరావతి చరిత్రను భావితరాలు పూర్తిగా మర్చిపోయేలా వైసీపీ సర్కార్‌ చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. దానికి బదులు బాబాయ్‌ గొడ్డలి పోటు, షర్మిల కన్నీటి గాథలను పాఠ్యాంశాల్లో చేరుస్తుందా? అని ఎద్దేవా చేశారు. అమరావతి పాఠాన్ని తొలగించడం ద్వారా రాజధాని పట్ల సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టమవుతోందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం విమర్శించారు. అమరావతి పేరు వింటేనే వైసీపీ నేతలకు దడ పుడుతోందని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. తక్షణం దీనిని పాఠ్యాంశంగా తిరిగి పొందుపరచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-07T14:26:20+05:30 IST