ఎన్నో సమస్యలు ‘గురూ’

ABN , First Publish Date - 2021-12-07T16:46:10+05:30 IST

పిల్లలకు..

ఎన్నో సమస్యలు ‘గురూ’

గురుకులాల్లో విద్యార్థులకు సరిపడా లేని గదులు..

పాఠాలు, భోజనం, నిద్ర సర్వం ఒకే గదిలోనే 

కొన్నిచోట్ల నీటి సమస్య, పరిమితంగా మరుగుదొడ్లు 

పారిశుధ్య లోపంతో డెంగీ, కరోనా బుగులు

త్వరలో ప్రిన్సిపాళ్లతో ఉన్నతాధికారుల సమావేశం


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): పిల్లలకు మంచి భోజనం పెట్టి.. అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ బోధన చేస్తే చదువు బాగా అబ్బుతుంది. ఈ భావనతోనే వెలసిన గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు, చక్కని వసతుల మధ్య ఉండాల్సింది పోయి వసతుల లేమితో సమస్యల వలయంలో గడుపుతున్నారు. ఉదయం నిద్రలేచింది మొదలు, మళ్లీ నిద్రపోయేదాకా పిల్లలు అడుగడుగునా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరిపడా గదులు, పాయఖానాలు లేకపోవడం.. తాగునీరు, స్నానానికి నీటి కొరత, బోర్లు పనిచేయకపోవడం వంటివి తీవ్రంగా వేధిస్తున్నాయి. ఉదయం మాస్టరు నోట పాఠాలు విన్న గదిలోనే  పిల్లలు నిద్రించాల్సి వస్తోంది. పిల్లల వస్తువులూ అక్కడే ఉంటున్నాయి. భోజనాలూ ఆ గదిలోనే చేస్తున్నారు. మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో చెంబు పట్టుకొని బయటకు వెళుతున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల్లో సరిగా నీటి వసతి లేకపోవడం, బోర్లు సరిగా పనిచేయకపోవడంతో వంతుల వారీగా స్నానాలు చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలా అన్ని గురుకులాలు వెయ్యికి పైగా ఉంటే చాలాచోట్ల సరైన సౌకర్యాలు లేవు.


పిల్లలకు బోధన, భోజనం, నిద్ర ఒకే గదిలో కావడంతో పారిశుధ్య లోపం తలెత్తింది. దీంతో డెంగ్యూతోపాటు ఇతర వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొన్ని గురుకులాల్లో భోజనం సరిగా లేకపోవంతో పిల్లలు కడుపునిండా తినడం లేదు. పౌష్టికాహారం అందకపోవడంతోనూ చదువుపై విద్యార్థులు ఏకాగ్రత చూపలేకపోతున్నారు. కరోనా కారణంగా సుమారు 18 నెలల విరామం తర్వాత గురుకుల విద్యా సంస్థలు అక్టోబరు 21న తెరుచుకున్నాయి. ప్రస్తుతానికి 60 నుంచి 80ు మంది విద్యార్ధులు మాత్రమే గురుకులాలకు హాజరవుతున్నారు. పూర్తి స్థాయిలో విద్యార్ధులు హాజరైతే పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుంది.


కరోనా లక్షణాలుంటే ఇంటికే..

చాలా గురుకులాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంతో విద్యార్ధులను కరోనా భయం వెంటాడుతోంది. కొవిడ్‌ లక్షణాలు ఉన్న విద్యార్ధులకోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నా అవి ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు.  విద్యార్ధుల్లో ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంకంపాలెం గిరిజన గురుకులంలో ఇద్ద రు విద్యార్ధినులు, పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ గురుకుల ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. సంగారెడ్డి జిల్లాలో బీసీ గురుకుల విద్యాలయంలో 40 మందికిపైగా విద్యార్థులు వైరస్‌ బారినపడ్డారు.


450 మంది విద్యార్ధులు.. 13 మరుగుదొడ్లు

గద్వాల జిల్లాలోని వీరాపురం గ్రామంలో ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో 5-10 తరగతి వరకు 450 మంది విద్యార్ధులు చదువుతున్నారు. అంతమంది విద్యార్ధులక ఏడు స్నానాల గదులు, 13 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో విద్యార్ధులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళ్తున్నారు. మంచినీటి సదుపాయం లేకపోవడంతో బయటి నుంచే నీరు తెప్పిస్తున్నారు. రాష్ట్రంలోని మరికొన్ని గురుకులాల్లోనూ విద్యార్ధులు ఈ తరహా సమస్యలతో సతమతమతమవుతున్నారు. 


కరోనా కేసులతో అప్రమత్తం

గురుకులాల్లో రోజుల వ్యవధిలోనే  సుమారు రెండు వందల వరకు కరోనా కేసులు వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  గురుకులాల్లో ఉంటున్న విద్యార్ధుల్ని బయటి వ్యక్తులు కలవకుండా సందర్శకులపై ఆంక్షలు విధించారు. మరీ అవసరమనుకుంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒక్కరు పిల్లల్ని కలిసేందుకు అనుమతిస్తున్నారు. కొన్ని గురుకులాల్లో ఆ అవకాశం కూడా కల్పించడం లేదు.సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని మహాత్మాజ్యోతిరావుఫూలే బాలికల గురుకుల పాఠశాలలో ఒకేసారి 47 మంది విద్యార్ధినులు, ఒక ఉపాధ్యాయుడు కరోనా బారిన పడటం కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితుల్ని ఆరా తీశారు. ప్రత్యక్ష తరగతులు పునః ప్రారంభమైన తర్వాత ఒకే విద్యాసంస్థలో ఇంత పెద్దమొత్తంలో పాజిటివ్‌ కేసులు రావడం ఇదే మొదటిసారి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని నందిగామ బీసీ గురుకులంలోనూ విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు. ఇప్పటికే విజిటర్స్‌పై ఆంక్షలు విధించిన ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల రాకపోకల్ని కట్టడిచేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే ఉపాధ్యాయుల్ని పిల్లలతోపాటే గురుకులంలో బస చేయించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే గురుకులాల్లో అందుకు సరిపడ వసతి, గదులు ఉన్నాయా లేదా అనేది ఆరా తీస్తున్నారు. 


వాట్సాప్‌ గ్రూప్‌లో అప్‌డేట్‌.. ప్రిన్సిపాళ్లతో సమావేశం

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హెల్త్‌ సూపర్‌వైజర్లు ప్రతి రోజు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు. విద్యార్ధుల్లో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాదపడుతున్నా, నీరసంగా కనిపించినా వారి వివరాల్ని అధికారులకు అందిస్తున్నారు. గతంలో కరోనా సమయంలో ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ను అధికారులు తిరిగి యాక్టివ్‌ చేశారు. హెల్త్‌ సూపర్జైజర్లు ఇచ్చే సమాచారాన్ని ప్రిన్సిపాల్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేస్తారు. అలాగే ఉన్నతాధికారులు ఏవైనా సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇవ్వాలన్నా వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఒమైక్రాన్‌ భయం పొంచి ఉన్న నేపథ్యంలో గురుకులాల్లో ప్రస్తుత పరిస్థితులు, విద్యార్ధుల్ని వైరస్‌ బారినుంచి రక్షించేందుకు తీసుకోవాల్సిన మరింత మెరుగైన చర్యలపై అన్ని గురుకులాల ప్రిన్సిపాళ్లు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లతో కార్యదర్శులు సమావేశమై చర్చించనున్నారు. గురుకులాల్లో పిల్లల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 


గురుకుల పాఠశాలలో ఎలుకల కలకలం.. 9 మంది విద్యార్థులకు గాయాలు

షాద్‌నగర్‌రూరల్‌: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి శివారు వివేకానంద కళాశాలలోని గురుకులంలో ఎలుకలు కలకలం సృష్టించాయి. 9 మంది విద్యార్థులు ఎలుకల బారిన పడి గాయాలపాలయ్యారు. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కేశంపేటకు చెందిన మహత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకులంలో 725 మంది విద్యార్థులు ఉన్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులంతా నిద్రించారు. 9వ తరగతి చదువుతున్న 9 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. ఉదయం మేల్కొన్న విద్యార్థులు తమ గాయాలను వార్డెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎలుకల గాటు గుర్తులు ఉండటంతో వెంటనే షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 

Updated Date - 2021-12-07T16:46:10+05:30 IST