నూతన విద్యావిధానంతో ప్రాథమిక పాఠశాలలు కనుమరుగు
ABN , First Publish Date - 2021-12-30T18:23:12+05:30 IST
ప్రాథమిక పాఠశాలలు కనుమరుగు కానున్నాయి. ప్రభుత్వ నూతన విద్యావిధానం పుణ్యమా అంటూ ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఇక నుంచి ఒకటి, రెండు తరగతులకే పరిమితం కానున్నాయి

ప్రాథమిక పాఠశాలల విలీనంలో నిబంధనల సవరణ
‘దూరం’ నిబంధన తొలుత 250 మీటర్లు
తాజాగా మూడు కిలోమీటర్లకు పెంపు
ఒక్కటిగా అంగన్‌వాడీ, 1,2 తరగతులు
టీచర్ల సర్దుబాటులోనూ గందరగోళం
ప్రాథమిక పాఠశాలలు కనుమరుగు కానున్నాయి. ప్రభుత్వ నూతన విద్యావిధానం పుణ్యమా అంటూ ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఇక నుంచి ఒకటి, రెండు తరగతులకే పరిమితం కానున్నాయి. మూడు కిలోమీటర్ల దూరంలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలంటూ మూడు రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ దూరాన్ని మూడు కిలోమీటర్లకు పెంచడం ద్వారా పేద పిల్లలను ఉచిత ప్రాథమిక విద్యకు దూరం చేయనుంది.