మూడు కీలక పోస్టుల్లో ఒక్కరే
ABN , First Publish Date - 2021-12-09T14:19:27+05:30 IST
వైద్య ఆరోగ్యశాఖలో మూడు కీలక పోస్టులను ఒక్కరికే అప్పగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్లుగా వైద్య విద్య సంచాలకుడి(డీఎంఈ)గా, రెండేళ్లుగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న రమేశ్‌రెడ్డిని..

మరోసారి డీఎంఈగా రమేశ్‌రెడ్డే
ఇప్పటికే ‘వైద్య పరిషత్’ కమిషనర్
ఆయనకే ‘గాంధీ’ ప్రిన్సిపాల్ పోస్టు
రహస్యంగా ప్రభుత్వ ఉత్తర్వుల జారీ
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో మూడు కీలక పోస్టులను ఒక్కరికే అప్పగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్లుగా వైద్య విద్య సంచాలకుడి(డీఎంఈ)గా, రెండేళ్లుగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న రమేశ్‌రెడ్డిని మరోసారి డీఎంఈగా కొనసాగించడంతోపాటు అదనంగా గాంధీ వైద్యవిద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించడంపై వైద్యవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ రెండేళ్లకు మించి ఎవ్వరినీ డీఎంఈగా కొనసాగించలేదు. అటువంటిది డాక్టర్ రమేశ్‌రెడ్డిని ఐదేళ్లపాటు డీఎంఈగా కొనసాగించడంతోపాటు అదనంగా కీలకమైన గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులో నియమించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మూడు కీలక పోస్టులను రమేశ్‌రెడ్డికే అప్పగించడంపై వైద్య శాఖలోని సీనియర్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అడిషనల్ డీఎంఈగా పదోన్నతి పొందిన వారిలో నుంచి ఒకరిని వైద్యవిద్య సంచాలకుడిగా ప్రభుత్వం నియమించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే పద్ధతిని కొనసాగించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ పోస్టు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోగా, నాటి నుంచి నేటి దాకా డీఎంఈ పోస్టును తెలంగాణ ప్రభుత్వం క్రియేట్ చేయలేదు. దీంతో డీఎంఈ పోస్టుకు ఇన్‌చార్జిలే దిక్కు అవుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నాలుగు సార్లు అడిషనల్ డీఎంఈలుగా పదోన్నతులు ఇచ్చారు. తెలంగాణలో మాత్రం ఏడేళ్ల తర్వాత తొలిసారి 31 మందికి అడిషనల్ డీఎంఈలుగా పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇందులో డాక్టర్ రమేశ్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆయనను గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు. కాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి వైద్యవిద్య కళాశాలలకు పూర్తిస్థాయిలో ప్రిన్సిపాల్స్‌ను ప్రభుత్వం నియమించింది.
ఇప్పటిదాకా మెడికల్ కాలేజీలన్నింటికీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్స్, వాటి అనుబంధ ఆస్పత్రులకు ఇన్‌చార్జి సూపరింటెండెంట్లుగానే పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం 31 మంది అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా పదోన్నతి పొందడంతో వారిని పూర్తిస్థాయి ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లుగా వేశారు. అయితే, పదోన్నతి పొందిన వారిలో కొంత మంది ప్రమోషన్ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు పదోన్నతి తీసుకుంటే హైదరాబాద్ విడిచి వెళ్లాల్సి ఉంటుంది. పదోన్నతిని తిరస్కరిస్తే ఎప్పటిలాగా రాజధానిలోనే ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఏడీఎంఈగా పదోన్నతి పొందిన వారు డిసెంబరు 22 వరకు వారికి కేటాయించిన పోస్టుల్లో చేరాలి. కాగా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమితులైన డీఎంఈ రమేశ్‌రెడ్డికి బుధవారం జూనియర్ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్‌తోపాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.