ఒక ప్రాంతంలో ఒకే స్కూల్!
ABN , First Publish Date - 2021-07-24T15:51:35+05:30 IST
కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని అధిగమించేందుకు, ప్రైవేటు స్కూళ్లను నిలబెట్టేందుకు యాజమాన్యాలు విలీనం బాట పట్టాయి. ఒక్కో ప్రాంతంలో ఉన్న రెండు, మూడు పాఠశాలలను ఒకటిగా మారుస్తున్నారు. తద్వారా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా

ప్రైవేటు స్కూళ్ల విలీనానికి యాజమాన్యాల నిర్ణయం..
2, 3 స్కూళ్లు కలిపి ఒకే చోట నిర్వహణ
జీతాలు, అద్దెలు తగ్గించుకునే ప్రయత్నం
కరోనా గండాన్ని అధిగమించేలా కార్యాచరణ
ప్రభుత్వమూ ఆదుకోవాలని వేడుకోలు
ఆస్తి పన్ను రద్దు చేయాలని కేటీఆర్‌కు లేఖ
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని అధిగమించేందుకు, ప్రైవేటు స్కూళ్లను నిలబెట్టేందుకు యాజమాన్యాలు విలీనం బాట పట్టాయి. ఒక్కో ప్రాంతంలో ఉన్న రెండు, మూడు పాఠశాలలను ఒకటిగా మారుస్తున్నారు. తద్వారా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా స్కూల్‌ను నిర్వహించడంతోపాటు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని భావిస్తున్నారు. కరోనా ప్రభావం విద్యారంగంపై వరుసగా రెండో ఏడాది కూడా తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల చేరిక భారీగా పడిపోయింది. ఉన్న విద్యార్థులు కూడా ఫీజు లు చెల్లించడంలేదు. దాంతో చాలా ప్రైవే ట్ స్కూళ్లు మూత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైమరీ స్కూళ్లను తెరిచేందుకు అనుమతించవచ్చని ఇటీవల ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. దాంతో థర్డ్ వేవ్ లేకపోతే.. ఆగస్టు లేదా సెప్టెంబరు నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. విద్యార్థులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ పాఠశాలలు తిరిగి తమ కార్యకలాపాలను ఎలా ప్రా రంభిస్తాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్పొరేట్, టెక్నో స్కూళ్లలో చేరే విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మెరు గ్గా ఉండడంతో వారు ఫీజులు కూడా చెల్లిస్తున్నారు. కానీ, చిన్న, మధ్య తరహా (బడ్జెట్) పాఠశాలలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పాఠశాలల్లో చేరే విద్యార్థులు ఎక్కువగా మధ్య తరగతికి చెందిన వారే కావడంతో ఫీజులు సరిగా చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
స్కూళ్లు నడవకుండానే పై తరగతికి..
గత ఏడాది స్కూళ్లు నడవకుండానే విద్యార్థులను ప్రమో ట్ చేశారు. దాంతో ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొందరు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. దాంతో చాలా ప్రైవేట్ పాఠశాలలు మూత దిశగా పయనిస్తున్నాయి. దీంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని రెండు మూడు స్కూళ్లు కలిపి ఒకే ప్రాంగణంలో ఒకే పాఠశాలగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా ప్రైవేట్ స్కూళ్లను అద్దె భవనాల్లో నెలకొల్పడంతో.. విలీనం ద్వారా ఈ అద్దె భారాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు టీచర్లు, ఇతర సిబ్బందికి చెల్లించే జీతాల భారాన్ని కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి..
ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు చాలా కాలంగా ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలను కోరుతున్నాయి. పాఠశాలలు ఆస్తి పన్నును ప్రస్తుతం కమర్షియల్ కేటగిరీలో చెల్లిస్తున్నాయి. దీనిని డొమెస్టిక్ పరిధిలోకి తీసుకురావాలని, కరోనా కాలానికి సంబంధించి ఈ పన్నును పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ట్రస్మా) అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. విద్యుత్తు సరఫరా బిల్లును కేటగిరీ-2 నుంచి కేటగిరీ-7కు మార్చాలని, కార్పొరేట్ స్కూళ్లను నియంత్రించాలని, ప్రైవేటు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని లేఖలో కోరారు. మరోవైపు కరోనా పరిస్థితుల దృష్ట్యా 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను టీసీ లేకపోయినా.. కొత్త స్కూళ్లల్లో చేర్చుకోవాలన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ప్రైవేటు స్కూళ్లు కోరుతున్నాయి.
రుణ సౌకర్యం కల్పించాలి
గత రెండేళ్లుగా విద్యార్థులు లేక ఫీజలు వసూలు కాక, చాలా పాఠశాలల యాజమాన్యాలు భారీగా అప్పుల పాలయ్యాయి. ఈ అప్పులను తీర్చడానికి, ప్రైవేట్ స్కూళ్లను రక్షించడానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలి. పాఠశాల అర్హతను బట్టి కనీసం రూ.10లక్షల నుంచి రూ.1కోటి వరకు రుణం ఇప్పించగలగాలి. పరిస్థితులు సర్దుకున్న తర్వాత ఆరేళ్ల కాలపరిమితిలో ఈ రుణాలున తిరిగి చెల్లించే అవకాశం ఇవ్వాలి.
-ఎస్ఎన్‌రెడ్డి, ట్రస్మా ప్రధాన కార్యదర్శి