త్వరలో లక్ష ఉద్యోగాలు..!

ABN , First Publish Date - 2021-10-31T16:49:25+05:30 IST

తర్వలో లక్ష ఉద్యోగాలు..

త్వరలో లక్ష ఉద్యోగాలు..!

ఇంటర్‌నెట్‌డెస్క్: ప్రముఖ ఐటీ కంపెనీలు త్వరలో దాదాపుగా లక్ష మంది ‘ఫ్రెషర్ల’ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి. అంతేకాకుండా వారి అవసరాల నిమిత్తం ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కూడా చెబుతున్నాయి. కరోనా కారణంగా అన్ని రకాలైన పనులు డిజిటల్ వైపు మళ్లిన నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు భారీ సంఖ్యలోనే లభిస్తున్నాయి. దీంతో సదరు కంపెనీలకు ఐటీ ఉద్యోగులు అవసరమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాదిలో దాదాపు లక్ష మంది కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


గత ఆరు నెలల వ్యవధిలో 43వేల మంది ఫ్రెషర్లను తీసుకున్నామని, వారికి తగిన శిక్షణ ఇవ్వడంతో మంచి ఫలితాలు సాధించామని టీసీఎస్ అధికారి మిలింద్ లక్కాడ్ గతవారం తెలిపిన సంగతి తెలిసిందే. రానున్న ఆరు నెలల వ్యవధిలో మరో 35వేల మందిని టీసీఎస్ నియమించుకోకున్నదని సమాచారం. తద్వారా ఈ సంవత్సరంలో మొత్తం 78వేల మందికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. కాగ్నిజెంట్ 45వేల మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు సమాచారం. విప్రో కూడా 25వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకునే పనిలో ఉంది. మరోపక్క హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తూ 20వేల మందిని కొత్తగా నియమించుకోకున్నది. నిపుణుల అవసరాలు పెరుగుతున్నందున బీటెక్ గ్రాడ్యుయేట్లను ముందుగానే ఉద్యోగాల్లోకి తీసుకుని తగిన శిక్షణ ఇచ్చి సిద్ధంగా పెట్టుకునే ఆలోచనతోనే ఈ కంపెనీలు నియామకాలు పెంచినట్లు సమాచారం.


ఐటీ కంపెనీలు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల కాలంలో ఐటీ పరిశ్రమలో ఆట్రిషన్ రేటు(ఉద్యోగుల వలసలు) పెరిగిన విషయం తెలిసిందే. ఉద్యోగ వలసలు ఐటీ పరిశ్రమలో మామూలుగా 10శాతం వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు అది 20.1శాతానికి పెరిగిపోయింది. ఈ కారణంగానే ఐటీ కంపెనీలు నియామకాలను అధికం చేస్తున్నాయి. Updated Date - 2021-10-31T16:49:25+05:30 IST