ప్రతి వైద్యవిద్యార్థి పరిశోధకుడు కావాలి
ABN , First Publish Date - 2021-03-24T16:16:33+05:30 IST
ప్రపంచంలో అత్యున్నతమైన వృత్తి వైద్యరంగమని.. ఎంబీబీఎస్ కోర్సులు చేసినవారు వైద్య పరిశోధకులుగా రాణించాలని పీఈఎస్ చాన్సలర్, కర్ణాటక ప్రభుత్వ విద్యాసంస్కరణల సలహాదారు ప్రొఫెసర్ ఎం.ఆర్.దొరస్వామి పిలుపునిచ్చారు.

కుప్పం మెడికల్ కళాశాల స్నాతకోత్సవంలో చాన్సలర్ దొరస్వామి
కుప్పం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో అత్యున్నతమైన వృత్తి వైద్యరంగమని.. ఎంబీబీఎస్ కోర్సులు చేసినవారు వైద్య పరిశోధకులుగా రాణించాలని పీఈఎస్ చాన్సలర్, కర్ణాటక ప్రభుత్వ విద్యాసంస్కరణల సలహాదారు ప్రొఫెసర్ ఎం.ఆర్.దొరస్వామి పిలుపునిచ్చారు. కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో మంగళవారం 13వ స్నాతకోత్సవం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఎస్వీకే ప్రసాద్‌రెడ్డి ముఖ్యులుగా పాల్గొన్నారు. డీన్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ క్రిష్ణారావు కుప్పం మెడికల్ కళాశాల సేవలను, విద్యార్థుల వివరాలను తెలిపారు. 2015 బ్యాచ్‌కు సంబంధించి 156 మంది ఎంబీబీఎస్, 2017 బ్యాచ్ పీజీకి చెందిన 60 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విజయవంతమైన వ్యాక్సిన్‌లను అందించిన ఘనత మన శాస్త్రవేత్తలదేనని ఈ సందర్భంగా చాన్సలర్ దొరస్వామి కొనియాడారు.
ఎంబీబీఎస్, పీజీలు పూర్తిచేసిన విద్యార్థులు మరిన్ని పరిశోధనలు చేయాలన్నారు. కళాశాలలో రూ.40 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిశోధనా విభాగం నిర్మిస్తామని ప్రకటించారు. కార్పొరేట్ హంగులతో కుప్పంలో మెడికల్ కళాశాల ఉండడం సంతోషకరమని ఎస్వీకే ప్రసాద్‌రెడ్డి అన్నారు. వైద్య విద్యార్థులు కరోనా క్లిష్ట సమయంలోనూ అంకితభావంతో సేవలందించారని గుర్తుచేశారు. ప్రస్తుతం కోర్సులు పూర్తి చేసినవారంతా ఏడాది కాలంగా ఎన్నో త్యాగాలతో సేవలందించారని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ క్రిష్ణమూర్తి ప్రశంసించారు. ఇన్‌చార్జి మెడికల్ సూపరింటెండెంట్ రైలీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ అవుట్‌గోయింగ్ స్టూడెంట్‌గా డాక్టర్ ఈజీ బాలక్రిష్ణ ఎంపికయ్యారు.