భద్రతా ప్రమాణాలు పాటించని 40 జూనియర్‌ కాలేజీలను మూసివేశాం

ABN , First Publish Date - 2021-02-26T16:42:45+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉన్న నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలు పాటించని 40 జూనియర్‌ కాలేజీలను మూసివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీటిలో శ్రీచైతన్య కాలేజీలు 10, నారాయణ కాలేజీలు 20, మరో 10 ఇతర జూనియర్‌ కాలేజీలు ఉన్నట్లు

భద్రతా ప్రమాణాలు పాటించని 40 జూనియర్‌ కాలేజీలను మూసివేశాం

హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉన్న నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలు పాటించని 40 జూనియర్‌ కాలేజీలను మూసివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీటిలో శ్రీచైతన్య కాలేజీలు 10, నారాయణ కాలేజీలు 20, మరో 10 ఇతర జూనియర్‌ కాలేజీలు ఉన్నట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు, మరికొన్ని సంస్థలు ఇంటర్మీడియట్‌ కాలేజీలు నిర్వహిస్తున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదంటూ సామాజిక కార్యకర్త డి.రాజేశ్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ సంజీవ్‌కుమార్‌ వివరణ ఇచ్చారు. నిబంధనలు పాటించని 65 కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామన్నారు. 25 కాలేజీలు చట్ట నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయన్నారు. 40 కాలేజీలకు ఈ విద్యాసంవత్సరానికి అనుబంధ గుర్తింపు రద్దు చేసినట్లు తెలిపారు. 


విద్యార్థుల భద్రతే ముఖ్యం: ధర్మాసనం

సరైన ప్రమాణాలు లేని భవనాల్లో కాలేజీలు కొనసాగించడం కంటే విద్యార్థుల భద్రతకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అగ్నిమాపక చట్టం కంటే ముందు నుంచీ నిర్వహిస్తున్న జూనియర్‌ కాలేజీలకు కొంత వెసులుబాటు కల్పించాలని కోరుతూ పలు ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేసింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లో మార్పులు చేసుకోవాలని, అలా కాని పక్షంలో అన్ని హంగులతో ఉన్న మరో ప్రాంగణానికి మార్చుకోవాలని స్పష్టం చేసింది. ప్రైవేటు కళాశాలల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదిస్తూ.. కొత్త చట్టం 1999లో వచ్చిందన్నారు. పాతభవనాల్లోని పాఠశాలలకు మినహాయింపు ఇచ్చారని, అదే విధంగా జూనియర్‌ కాలేజీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించిన ధర్మాసనం వ్యాజ్యాలను కొట్టివేసింది. 


Updated Date - 2021-02-26T16:42:45+05:30 IST