జేఈఈ సిలబస్‌ తగ్గించలేదు

ABN , First Publish Date - 2021-01-20T16:44:48+05:30 IST

కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అంతా ఆన్‌లైన్‌ బోధన కొనసాగడంతో సీబీఎ్‌సఈ

జేఈఈ సిలబస్‌ తగ్గించలేదు

ఈసారి కూడా గత ఏడాది పాఠ్యాంశాలే 

జేఈఈ (మెయిన్‌)- 2021 సిలబస్‌ వెల్లడి

5 ప్రశ్నల ఆప్షన్స్‌, నెగెటివ్‌ మార్కుల తొలగింపు

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్ణయంతో ఊరట 

75 శాతం మార్కుల నిబంధన ఎత్తివేత


హైదరాబాద్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అంతా ఆన్‌లైన్‌ బోధన కొనసాగడంతో  సీబీఎ్‌సఈ బోర్డు పరీక్షలతోపాటు ‘జేఈఈ’, ‘నీట్‌’ సిలబ్‌సను 30శాతం తగ్గిస్తున్నామని కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో సంభాషిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ సోమవారం ప్రకటించారు. కానీ, ఇదే విషయంపై మంగళవారం పూర్తి విరుద్ధమైన ప్రకటన వెలువడింది. జేఈఈ మెయిన్‌కు గత ఏడాది ఉన్నట్టుగానే సిలబస్‌ ఉంటుందని, ఎలాంటి మార్పు లేదని కేంద్ర విద్యాశాఖ ఉదయం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలతో విద్యార్థుల్లో అయోమయం నెలకొనగా...దీనిని దూరం చేస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం జేఈఈ మెయిన్‌-2021 సిలబ్‌సను విడుదల చేసింది.  


గత ఏడాది పాఠ్యాంశాలే.. 

మంగళవారం ఉదయం కేంద్రవిద్యాశాఖ ప్రకటించినట్టుగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి సిలబ్‌సలో ఎలాంటి మార్పు లేదు. గత ఏడాది మేథమెటిక్స్‌లో మొత్తం 16 యూనిట్లు ఉండగా.. ఈసారి సైతం అవే ఉన్నాయి. అలాగే గత ఏడాది ఫిజిక్స్‌ సెక్షన్‌-ఎలో 20, సెక్షన్‌-బిలో 1 చొప్పున మొత్తం 21 యూనిట్లు ఉండగా.. ఈసారి కూడా అవే కొనసాగనున్నాయి. కెమిస్ర్టీలో సెక్షన్‌-ఎలో 10, సెక్షన్‌-బిలో 8, సెక్షన్‌-సిలో 10 చొప్పున మొత్తం 28 యూనిట్లలో ఈసారి ఒక్క యూనిట్‌ కూడా మారలేదు.  కాకపోతే ఈసారి ఆప్షన్స్‌ ప్రశ్నలు ఇవ్వడం, నెగెటివ్‌ మార్కులు లేకపోవడం విద్యార్థులకు కాస్త ఊరట. ప్రతిసారి మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ర్టీలో 25 చొప్పున మొత్తం 75 మార్కులు ఉంటుండగా, తప్పుడు సమాధానానికి 1/4 నెగెటివ్‌ మార్కు ఉండేది. ఈసారి నెగెటివ్‌ మార్కు విధానం తొలగించారు. ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నల స్థానంలో 30 ప్రశ్నలుంటాయి. గతంలో ఎలాంటి ఆప్షన్స్‌ ఇచ్చేవారు కాదు. కానీ, ఈసారి 5 ప్రశ్నలు ఆప్షన్స్‌గా ఇస్తున్నారు. సీబీఎ్‌సఈతోపాటు వివిధ రాష్ట్రాల్లోని బోర్డులు 12వ తరగతిలో 30శాతం సిలబస్‌ తగ్గించిన నేపథ్యంలో విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు ఈసారి 5 ప్రశ్నలను ఆప్షన్స్‌ రూపంలో ఇస్తున్నామని సిలబస్‌ చివర్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఎజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది. జేఈఈ సిలబస్‌ తగ్గిస్తే ఐఐటీ, ఎన్‌ఐటీల్లో విద్యార్థులు ఇబ్బందులు పడతారన్న ఆలోచనతో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుందని ఐఐటీ జేఈఈ ఫోరం అధ్యక్షుడు లలిత్‌ కుమార్‌ అన్నారు. విద్యార్థులు పూర్తి సిలబ్‌సపై దృష్టి సారించాలని, ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈసారి జేఈఈ మెయిన్‌ను పరీక్ష నాలుగుసార్లు రాసే అవకాశం కల్పించారని ఆయన వివరించారు.


75 శాతం మార్కుల నిబంధన ఎత్తివేత

ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశ నిబంధనలను కేంద్రం సడలించింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌లో 75 శాతం మార్కులు వచ్చి ఉండాలనే నిబంధనను ఎత్తివేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. జేఈఈ(అడ్వాన్స్‌), గతేడాది తీసుకున్న నిర్ణయాలను పరిగణిస్తూ 2021-22 విద్యా సంవత్సరంలోనూ ఇంటర్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను తొలగించామని, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, సీఎ్‌ఫటీఐలు... జేఈఈ(మెయిన్‌) ఫలితాల ఆధారంగా ప్రవేశాల కల్పిస్తాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
జేఈఈ మెయిన్‌-2021 సిలబస్‌ చివర్లో ఎన్టీఏ ప్రకటన 


Updated Date - 2021-01-20T16:44:48+05:30 IST