ఫీజు కడితే పాస్
ABN , First Publish Date - 2021-07-24T16:30:06+05:30 IST
ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారమిక్కడ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఫెయిలైనా, గైర్హాజరైనా సెకండియర్ పరీక్షలకు ఫీజు కట్టిన వారందరికీ కనీస పాస్ మార్కులు ఇచ్చారు.

ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
గడువు కంటే వారం ముందే ఫలితాలు..
టెన్త్‌పై వచ్చేవారం నిర్ణయం: సురేశ్
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారమిక్కడ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఫెయిలైనా, గైర్హాజరైనా సెకండియర్ పరీక్షలకు ఫీజు కట్టిన వారందరికీ కనీస పాస్ మార్కులు ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన మూడు వెబ్‌సైట్లలో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 26నుంచి మార్కుల మెమోలు ప్రింట్ తీసుకోవచ్చు. ఫలితాల విడుల సందర్భంగా మంత్రి సురేశ్ మీడియాతో మాట్లాడారు. ‘‘విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్ పరీక్షల నిర్వహణను రద్దుచేశాం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఛాయారతన్ కమిటీ నివేదిక ప్రకారం టెన్త్‌లో అత్యధిక మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులకు 30శాతం, ఇంటర్ మొదటి సంవత్సరం మార్కులకు 70శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించాం. ఆ మేరకు విద్యార్థులకు మార్కులు కేటాయించి ఫలితాలు విడుదల చేస్తున్నాం’’ అని ప్రకటించారు. మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులకు కొవిడ్ నియంత్రణలోకి వచ్చాక పరీక్షలు నిర్వహించి, మార్కులు ఇస్తారని చెప్పారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 31లోపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఇవ్వాలని, ఆ గడువు కంటే వారం ముందుగానే ప్రకటించామన్నారు. మొత్తం 5,08,672 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఇందులో బాలురు 2,53,138 మంది, బాలికలు 2,55,534మంది ఉన్నారని వివరించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ చదివిన వారందరికీ కనీస పాస్ మార్కులిస్తున్నామని మంత్రి తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత వారికి బెటర్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ పరీక్షల ఫలితాలపై వచ్చేవారం నిర్ణయం తీసుకుంటామని... అనంతరం ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాలను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుందని చెప్పారు.