త్రిశంకు స్వర్గంలో ఇంటర్ విద్య
ABN , First Publish Date - 2021-01-12T15:41:24+05:30 IST
వార్షిక పరీక్షలకు 3నెలల్లో ముహూర్తం ముంచుకురానుంది. ఇంకా ఇంటర్ తరగతులు ప్రారంభం కాలేదు. ఫిబ్రవరి ఒకటి నుంచి తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సీఎం

ఏడాది చివర్లో తరగతులు మొదలు..
సిలబస్ పూర్తి కావడం అనుమానమే
అసలు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారా?
మరి, వార్షిక పరీక్షల నిర్వహణ ఎప్పుడు?
జాతీయ స్థాయి పరీక్షలకు సన్నద్ధమెలా?
ఇతర రాష్ట్రాల ఇంజనీరింగ్‌కు హాజరయ్యేదెలా?
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనలు
సర్కారు ముందే స్పష్టం చేయాలని డిమాండ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
వార్షిక పరీక్షలకు 3నెలల్లో ముహూర్తం ముంచుకురానుంది. ఇంకా ఇంటర్ తరగతులు ప్రారంభం కాలేదు. ఫిబ్రవరి ఒకటి నుంచి తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ తాజాగా నిర్దేశించారు. కేవలం 2నెలల్లోనే పరీక్షలు నిర్వహిస్తారా?. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒక్కసారి కూడా ల్యాబొరేటరీలోకి అడుగు పెట్టలేదు. నెల రోజుల్లో వార్షిక ప్రాక్టికల్ పరీక్షలు జరగాల్సి ఉంది. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారా? అయితే ఎలా!?. మరోవైపు, ఫిబ్రవరి 23 నుంచి తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. నాలుగు విడతల్లో నాలుగు నెలలపాటు జరిగినా.. వాటికి హాజరు కావడానికి పూర్తి స్థాయి సన్నద్ధత లేదు. సరికదా.. జేఈఈ పరీక్షలు, వార్షిక పరీక్షలు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది! రెండింటినీ ఒకేసారి ఎదుర్కోవడం ఎలా!?. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన ఇది. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో తమ పిల్లలు జేఈఈ, నీట్ పరీక్షల్లో వెనకబడతారేమోననే సందేహమూ వారిని వెన్నాడుతోంది.
అదే సమయంలో, ఇప్పుడు తరగతులు నిర్వహిస్తే పిల్లలను పంపేందుకు కొందరు తల్లిదండ్రలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలు తెరిస్తే పిల్లలను ఆటోల్లోనో, బస్సుల్లోనో పంపాల్సి ఉంటుంది. కాలేజీలో కూడా గుంపులు గుంపులుగా విద్యార్థులు ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలకు కరోనా వస్తే..!? వారి ద్వారా ఇంట్లో వాళ్లకు సోకితే.. అనే ఆందోళన వారిని వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో, కాలేజీలు, పరీక్షల నిర్వహణ ప్రభుత్వానికి కూడా కత్తి మీద సాముగా మారింది. లాక్‌డౌన్‌తో గత ఏడాది మార్చి 23వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. గత విద్యా సంవత్సరం ముగింపులో ఈ సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉండగా.. పలు రాష్ట్రాలు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్యకు కీలకమైన 12వ తరగతి(ఇంటర్) తరగతుల ప్రారంభంలో అనేక రాష్ట్రాలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సెకండియర్ ప్రత్యక్ష తరగతులు నవంబరు రెండో తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అక్కడ అన్ని కాలేజీల్లో తరగతులు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు రెసిడెన్షియల్ కాలేజీల్లో హాస్టళ్లు కూడా తెరిచారు. కరోనా కేసుల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న మహారాష్ట్రలో నవంబరు 23వ తేదీ నుంచే 12వ తరగతి తరగతులు ప్రారంభమయ్యాయి. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ఈ నెలలో ప్రారంభమయ్యాయి.
జాతీయ పరీక్షలు ఎలా రాసేది?
ఇంటర్ సెకండియర్ సైన్స్ గ్రూప్ చదివే విద్యార్థుల్లో అత్యధికుల లక్ష్యం జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించడమే ఉంటుంది. ముఖ్యంగా జేఈఈ, నీట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు జేఈఈ, నీట్‌తోపాటు జాతీయస్థాయిలో నిర్వహించే ఇతర పరీక్షల్లో పాల్గొంటారు. కానీ, రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వార్షిక పరీక్షలు నిర్వహిస్తే.. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడం కష్టమవుతుంది. ఒకవేళ, ఏప్రిల్ వరకూ తరగతులు నిర్వహించి మే, జూన్‌ల్లో వార్షిక పరీక్షలను నిర్వహించాలని భావిస్తే.. జాతీయ స్థాయి పరీక్షల ముందు ఇంటర్ సిలబస్ పూర్తి కాదు.జేఈఈ, నీట్ పరీక్షల్లో విద్యార్థులు వెనకబడే అవకాశాలు ఉన్నాయని అధ్యాపకులు చెబుతున్నారు. 10, 11, 12 తరగతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం గతంలోనే స్పష్టం చేయడంతో పలు రాష్ట్రాలు అన్ని జాగ్రత్తలతో తరగతులు ప్రారంభించగా.. ఇక్కడ మాత్రం జాప్యం జరుగుతోంది.
ఇక, పొరుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ పరీక్షలు ముందుగానే నిర్వహిస్తే..ఇక్కడ సిలబస్ పూర్తి కాకుండా అక్కడ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరు కావడమూ సమస్యే. దీనికితోడు, ఈ ఏడాది సిలబ్‌సలో 30ు కోత విధించారు. మిగిలిన 70ు సిలబస్ ఇంత తక్కువ సమయంలో పూర్తవుతుందా అనేది ప్రశ్నార్థకమే. పాఠాలు పూర్తి కాకుండా పరీక్షలు రాయడం ఎలా అని విద్యార్థులు మథన పడుతున్నారు. ‘కరోనా బ్యాచ్’ అనే ముద్ర పడుతుందనే భయంతో పరీక్షల్లేకుండా ఉత్తీర్ణులు కావడానికి ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. పరీక్షల గండం గట్టెక్కడమెలాగో వారికి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే, ఎన్ని రోజులు తరగతులు నిర్వహిస్తారు? వార్షిక పరీక్షల నిర్వహణ ఎప్పుడు? పరీక్షలను ఏ విధానంలో నిర్వహిస్తారు? తదితర అంశాలపై సర్కారు ముందే స్పష్టం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాక్టికల్స్‌పై అయోమయం
ఈసారి ఇంటర్ సెకండియర్ ఎంపీసీ విద్యార్థులకు 2సబ్జెక్టులు, బైపీసీ విద్యార్థులకు 4సబ్జెక్టుల్లో 30ు ప్రాక్టికల్స్ మార్కులు ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి వారంలో ఒకరోజు చొప్పున ప్రయోగశాలల్లో ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించేవారు. ప్రతి సబ్జెక్టుకు 40-50 చొప్పున ఈ తరగతులుండేవి. ఈసారి ఇంటర్ బోర్డు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆన్‌లైన్ తరగతుల్లోనూ వీటి గురించి అసలు ప్రస్తావనే లేదు. ఏటా వార్షిక పరీక్షలకు నెల ముందు ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ వార్షిక పరీక్షలు ఉండేవి. ఈసారి ఇంతవరకూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోలేదు.
ఫీజ్ కట్టని వాళ్లకు ప్రైవేట్‌గా అవకాశం
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతమంది కాలేజీల్లో చేరలేదు. మరికొందరు కాలేజీల్లో చేరినా.. ఫీజు కట్టని కారణంగా మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. ఇటువంటి వారు ప్రైవేటుగా ఇంటర్ చదువుకునే అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. నేరుగా పరీక్షలు రాసుకునే అవకాశం వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
50 శాతం సిలబస్ తగ్గించాలి
సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులకు చాలామంది విద్యార్థులు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం సత్వరమే ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభించాలి. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం తరగతులు నిర్వహించాలి. ఇప్పటి నుంచి 100 నుంచి 120 రోజులపాటు భౌతిక తరగతులు నిర్వహించాలి. సిలబ్‌సను 40 నుంచి 50 శాతం వరకు తగ్గించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచి పకడ్బందీ ప్రణాళిక.. కొవిడ్-19 జాగ్రత్తలతో కళాశాలలను ప్రారంభించాలి.
- శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు
సరైన జాగ్రత్తలతో కళాశాలలు ప్రారంభించాలి
కరోనాతో ఇప్పటికే పిల్లల చదువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పోటీ పరీక్షలు రాయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం తగిన జాగ్రత్తలతో భౌతిక తరగతులు నిర్వహించాలి. సంక్రాంతి తర్వాత నుంచే ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించాలి.
- వొగిలిశెట్టి యుగంధర్, విద్యార్థి తండ్రి, కరీమాబాద్, వరంగల్
50 శాతం సిలబ్‌సకే పరీక్షలు నిర్వహించాలి
కరోనా వల్ల ఈ ఏడాది మా అబ్బాయికి ఇంటర్ చదువు సాగలేదు. ఆన్‌లైన్ క్లాసులు అర్థం కాలేదు. సిలబస్ కూడా పూర్తి కాలేదు. ఫిబ్రవరి నుంచి క్లాసులు నడిపినా సిలబస్ పూర్తిచేయడం సాధ్యం కాదు. 50 శాతం సిలబస్ అయితే ఎలాగోలా పిల్లలు నెట్టుకొస్తారు. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని 50 శాతం సిలబ్‌సకే పరీక్షలు నిర్వహించాలి. గ్రేస్ మార్కుల విషయం కూడా పరిశీలించాలి.
- రాములు, ఇంటర్ విద్యార్థి తండ్రి
సిలబస్ భారమే
కరోనాతో ఈ ఏడాది ఇంటర్ విద్యార్ధులకు చాలా ఇబ్బంది కలిగింది. తరగతులు నిర్వహించలేకపోయాం. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించినా విద్యార్థులంతా వాటిని పొందలేకపోయారు. 70 శాతం సిలబ్‌సతోనే పరీక్షలు నిర్వహిస్తున్నందున ఆన్‌లైన్ విద్యార్థులు నెగ్గుకొచ్చే అవకాశముంది. ఆఫ్‌లైన్ విద్యార్థులకు మాత్రం కొంత ఇబ్బందే. ఏప్రిల్ చివరి వారం నుంచి పరీక్షలు నిర్వహించినా అప్పటికి 70 శాతం సిలబస్ పూర్తికావడం కష్టమే. ఈ విషయాల్ని గుర్తించి ప్రభుత్వం పరీక్షల నిర్వహణ తీరుపై కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నాం.
- వెంకటరెడ్డి, లెక్చరర్