FAC పేరిట ‘అక్రమ’ పదోన్నతులు

ABN , First Publish Date - 2021-08-12T16:49:02+05:30 IST

జల వనరుల శాఖలో..

FAC పేరిట ‘అక్రమ’ పదోన్నతులు

మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసులతో అందలం 

జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల గగ్గోలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖలో ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది పదోన్నతులకు అనధికారికంగా బ్రేక్‌ పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇంజనీరింగ్‌ అధికారుల సీనియారిటీని మూడేళ్ల కిందట ఖరారు చేశారు. దీంతో దశాబ్దాలుగా తాము పడుతున్న వ్యధకు పరిష్కారం లభించిందని ఇంజనీరింగ్‌ అధికారులు భావించారు. శాఖలో ఖాళీలు ఏర్పడ్డ వెంటనే రోస్టర్‌ విధానంలో పదోన్నతులు కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, గత రెండేళ్లుగా ఈ విధానానికి స్వస్తి పలికారు. గడచిన రెండేళ్లలో ఆ శాఖలో అధిక సంఖ్యలో ఇంజనీరింగ్‌ అధికారులు రిటైరయ్యారు. ఆ ఖాళీలను రోస్టర్‌ విధానంలో పదోన్నతులు కల్పించి భర్తీ చేయడం లేదు. దీంతో ఎక్కడి వారడక్కడే అన్నట్లుగా ఇంజనీరింగ్‌ అధికారులు ప్రమోషన్లకు నోచుకోవడం లేదు.


కీలకమైన చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రోస్టర్‌ విధానాన్ని అమలు చేయకుండా.. ప్రమోషన్లపై అనధికారికంగా స్టాప్‌ ఆర్డర్‌ను పెట్టడంతో కీలక స్థానాలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో.. ఈ స్థానాల కోసం కొందరు ఇంజనీరింగ్‌ అధికారులు పైరవీలు ప్రారంభించారు. మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కలసి సిఫారసు లేఖలు తీసుకుంటున్నారు. అలా పలువురు ఇంజనీరింగ్‌ అధికారులు ‘పూర్తి అదనపు బాధ్యతలు’ పేరిట అక్రమ పదోన్నతులకు దారులు తెరిచారని ఇంజనీరింగ్‌ అధికారులు ఆరోపిస్తున్నారు.


రాష్ట్రంలో ప్రమోషన్లకు అన్‌లాక్‌ విధానం అమలులోకి తీసుకురావడం వల్ల 385 మంది చీఫ్‌ ఇంజనీర్లు, సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు పదోన్నతులు కోల్పోయారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో కోర్టు కేసులు సామరస్యంగా పరిష్కరించుకుని పదోన్నతులు కల్పిస్తున్నారు. కానీ, ఏపీలో    అలాంటి న్యాయపరమైన ప్రతికూలతలు లేకున్నా .. ప్రమోషన్లు మాత్రం ఇవ్వకుండా అక్రమ విధానంలో ప్రజా ప్రతినిధులు, మంత్రుల సిఫారసులేఖలతో ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడం .. జల వనరుల శాఖలో చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2021-08-12T16:49:02+05:30 IST