హాస్టళ్ల మరమ్మతుకు 50వేలు

ABN , First Publish Date - 2021-01-13T16:39:09+05:30 IST

ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనుండడంతో.. ఈ నెల 20 నాటికే వసతిగృహాలు, గురుకులాల్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు

హాస్టళ్ల మరమ్మతుకు 50వేలు

ఈ నెల 20 నాటికే నిత్యావసరాలు, సామగ్రి సేకరణ.. 26 తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల తనిఖీలు


హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనుండడంతో.. ఈ నెల 20 నాటికే వసతిగృహాలు, గురుకులాల్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. బియ్యం, నిత్యావసరాలు, ఇతర సామగ్రిని సేకరిస్తారు. వసతి గృహాల తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.50 వేలను మంజూరు చేయనున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుంగుల కమలాకర్‌ మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు వివిధ విభాగాధిపతులతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.


సంక్షే మ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఈ నెల 25వ తేదీలోగా విద్యార్థులకు అవసరమైన సన్నబియ్యం, పప్పు, ఉప్పులు, నూనె తదితర సరుకులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో శానిటేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 26వ తేదీ తర్వాత హస్టళ్లల్లో వసతులపై మంత్రులు, ఎమ్మెల్యేలు తనిఖీలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.  కాగా, ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో తరగతులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రాంచంద్రన్‌, పాఠశాల, ఇంటర్‌, సాంకేతిక విద్య కమిషనర్లు శ్రీదేవసేన, సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌, నవీన్‌ మిట్టల్‌తో మంత్రి సమీక్ష  నిర్వహించారు.    


వసతి గృహాల ప్రారంభంపై మార్గదర్శకాలు

9, 10, ఇంటర్‌ విద్యార్థుల వసతిగృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించనున్న దృష్ట్యా అందుకు సంబంధించి వసతులు, ఆహార పదార్థాలను జనవరి 20 నాటికే సమకూర్చుకోవాలి.

వసతి గృహాలు, గురుకులాలను శానిటైజ్‌ చేసేలా సంబంధిత మునిసిపల్‌/పంచాయతీరాజ్‌ సంస్థలతో కలిసి చర్యలు తీసుకోవాలి. 

విద్యార్థులు వసతి పొందేలా అన్ని గదులను, ప్రాంగణాలను శుభ్రం చేయించాలి. 

స్కూళ్లకు అవసరమైన ఇండెంట్‌ను జిల్లా పర్చేజ్‌ కమిటీ ద్వారా జాయింట్‌ కలెక్టర్‌కు పంపాలి. 

మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ నెల 25 తరువాత వసతిగృహాలు, గురుకులాలను సందర్శించాలి. 

చిన్న చిన్న మరమ్మతులకు రూ.50 వేలను వసతి గృహాలకు అందజేస్తారు. అంతకు మించి నిధులు అవసరమైతే కలెక్టర్‌ ప్రతిపాదించాలి. 

మరుగుదొడ్లను శుభ్రపర్చడంతో పాటు నీటి వసతి సక్రమంగా ఉండేలా చూడాలి. 

శానిటైజేషన్‌ మెటీరియల్‌, మాస్కులు కొనుగోలు చేసి ఉంటే వాటిని వినియోగించుకోవాలి. 

కరోనా నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించాలి. కరోనా లక్షణాలు గుర్తిస్తే.. జిల్లా అధికారులకు వెంటనే సమాచారం అందించాలి. 

మెరుగైన పారిశుధ్య నిర్వహణ ఉండాలి. 


Updated Date - 2021-01-13T16:39:09+05:30 IST