తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

ABN , First Publish Date - 2021-01-13T17:04:01+05:30 IST

డిగ్రీ, ఇతర వృతి విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదలచేసింది. తరగతులకు హాజరయ్యే

తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

పరీక్షలకు కనీస హాజరు మినహాయింపు 

సగం మంది విద్యార్థులకు 

రొటేషన్‌ పద్ధతిలో తరగతులు 

పాఠశాల, ఉన్నత విద్య

కాలేజీలకు ప్రభుత్వ మార్గదర్శకాలు 

కలెక్టర్‌ నేతృత్వంలో 

జిల్లాస్థాయిలో కమిటీల ఏర్పాటు 

హాస్టళ్ల మరమ్మతుకు 50 వేలు

26 తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల తనిఖీ

అధికారులతో మంత్రి గుంగుల సమీక్ష

హాస్టళ్ల పున:ప్రారంభంపై మార్గదర్శకాలు

కార్యచరణ సిద్ధం చేయండి: సబిత 


హైదరాబాద్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): డిగ్రీ, ఇతర వృతి విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదలచేసింది. తరగతులకు హాజరయ్యే విద్యార్థులంతా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. పాఠశాల, ఉన్నత విద్యకు సంబంధించి విడుదలచేసిన మార్గదర్శకాలు ఇవీ..ఫిబ్రవరి 1 నుంచి తరగతుల ప్రారంభంపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాస్థాయిలో విద్యా పర్యవేక్షణ కమిటీలను(డీఎల్‌ఈఎంసీ) ఏర్పాటు చేసింది.


దీనికి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, ఐటీడీఏ పీవో, జిల్లా వైద్యాధికారి, మునిసిపల్‌ కమిషనర్‌, డీపీవో, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి సభ్యులుగా ఉంటారు. ఏదైనా ఒక కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు మరో అధికారిని కలెక్టర్‌ నియమిస్తారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణను ఈనెల 18లోపు సమర్పించాల్సి ఉంటుంది. 


పాఠశాలలు, కళాశాలల్లో పారిశుధ్య కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రణాళికను ఈ కమిటీ రూపొందించాలి. మరుగుదొడ్లు, మంచినీటి వసతి, తరగతి గదుల శానిటైజేషన్‌తోపాటు విద్యార్థుల రవాణా, వైద్యసేవలకు సంబంధించీ ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. 

డిగ్రీ, ఇతర వృత్తివిద్య కోర్సులకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి అని అందులో స్పష్టం చేసింది. 

వార్షిక పరీక్షలు రాసేందుకు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన నుంచి ప్రభుత్వం ఈసారికి మినహాయింపునిచ్చింది.

విద్యార్థులు సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. మరుగుదొడ్లు, తరగతి గదులు, క్యాంటిన్‌ను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తుండాలి. 

విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది మినహా ఇతరులెవరికీ కళాశాలలో అనుమతి లేదు. 


Updated Date - 2021-01-13T17:04:01+05:30 IST