అడిషనల్‌ డీఎంఈలకు గ్రిన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-12-08T14:51:23+05:30 IST

ఎట్టకేలకు వైద్య, విద్యా పరిధిలోని అడిషనల్‌ డైరెక్టర్లుగా ప్రమోషన్లు పొందిన 31 మందికి సర్కారు పోస్టింగ్‌ ఇచ్చింది. వారిలో 14 మెడికల్‌ కాలేజీలకు..

అడిషనల్‌ డీఎంఈలకు గ్రిన్‌సిగ్నల్‌

31 మందికి పోస్టింగ్‌ ఇచ్చిన సర్కారు 

నాలుగు నెలల కిందట డీపీసీ పూర్తి

14 మెడికల్‌ కాలేజీలకు ప్రిన్సిపాళ్లు

గాంధీ ప్రిన్సిపాల్‌గా రమేశ్‌ రెడ్డి


హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు వైద్య, విద్యా పరిధిలోని అడిషనల్‌ డైరెక్టర్లుగా ప్రమోషన్లు పొందిన 31 మందికి సర్కారు పోస్టింగ్‌ ఇచ్చింది. వారిలో 14 మెడికల్‌ కాలేజీలకు కొత్తగా ప్రిన్సిపాళ్లను నియమించింది. ఈ మేరకు సర్కారు మంగళవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త కాలేజీలకు ప్రిన్సిపాళ్లు లేరంటూ రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైద్యశాఖ మంత్రి హరీశ్‌ రావు సంబంధిత ఫైల్‌ను వెంటనే తెప్పించుకొని ఆమోదం తెలిపారు. దాంతో మంగళవారం జీఓ విడుదల అయింది. కాగా అడిషనల్‌ డీఎమ్‌ఈ డీపీసీ (డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) పూర్తయి నాలుగు నెలలవుతోంది. ఇన్ని రోజుల తర్వాత పదోన్నతులు పొందిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. డీపీసీ రోస్టర్‌ విధానం ప్రకారం పదోన్నతులు పొందిన వారిలో కొందరిని ప్రిన్సిపాల్‌గా, మరికొందరిని మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లుగా సర్కారు నియమించింది. ఇంకా ప్రస్తుతం డీఎమ్‌ఈగా కొనసాగుతున్న రమేశ్‌రెడ్డిని గాంధీ మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌గా, ఎమ్‌ఎన్‌జె డైరెక్టర్‌గా ఉన్న జయలతను సూర్యాపేట ప్రిన్సిపాల్‌గా నియమించింది.


Updated Date - 2021-12-08T14:51:23+05:30 IST