అగ్రవర్ణ పేదలకు 5 ఏళ్ల సడలింపు.. నియామక పరీక్ష ఫీజు మినహాయింపు

ABN , First Publish Date - 2021-08-25T16:33:59+05:30 IST

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు ఉద్యోగ నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితి సడలింపు, పరీక్ష ఫీజులో మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వివిధ ఉద్యోగ నియామకాల ప్రక్రియలు ప్రారంభమవుతుండడం..

అగ్రవర్ణ పేదలకు 5 ఏళ్ల సడలింపు.. నియామక పరీక్ష ఫీజు మినహాయింపు

రూ.8 లక్షల్లోపు కుటుంబ వార్షికాదాయం ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్‌ 

ఈడబ్ల్యూఎస్‌ మార్గదర్శకాల జారీ

తప్పుడు ధ్రువీకరణపత్రాలిస్తే టెర్మినేషన్‌

అర్హులు లభించకపోతే బ్యాక్‌లాగ్‌ ఉండదు

మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్లు


హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు ఉద్యోగ నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితి సడలింపు, పరీక్ష ఫీజులో మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.  వివిధ ఉద్యోగ నియామకాల ప్రక్రియలు ప్రారంభమవుతుండడం, ఎంసెట్‌, నీట్‌లకు అర్హత సాధించే అభ్యర్థులకు సీట్లు కేటాయించాల్సి ఉన్నందున ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి పది శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ సందర్భాల్లో, విద్యా సంస్థల్లోని సీట్లను కేటాయించేటప్పుడు ఈ పదిశాతం రిజర్వేషన్‌ నియమాలను అనుసరించాలంటూ అన్ని విద్యా సంస్థలు, రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలను ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేటు, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం సీట్ల కేటాయింపు, వివిధ రకాల ఉద్యోగ నియామకాల్లో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ రిజర్వేషన్ల అవకాశాన్ని రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకు కూడా అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఉత్తర్వులు(జీఓ నెంబర్‌ 33) జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వర్తించే రోస్టర్‌ పాయింట్లను కూడా ప్రకటించింది. అయితే, ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి తగిన మార్గదర్శకాలను ప్రత్యేకంగా జారీ చేసుకోవాల్సిందిగా సాధారణ పరిపాలన(జీఏడీ), విద్యా శాఖలను ఆదేశించింది. ఈమేరకు మార్గదర్శకాల జీఓ(244)ను జీఏడీ మంగళవారం జారీ చేసింది. 


ఇవీ మార్గదర్శకాలు


ప్రత్యక్ష ఎంపిక విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కిందకురాని ఈడబ్ల్యూఎస్‌ వర్గాలే పది శాతం రిజర్వేషన్లకు అర్హులు.


కుటుంబం (తల్లిదండ్రులు, అవివాహితులైన చెల్లెళ్లు, తమ్ముళ్లు, భార్య, పిల్లలు) వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.


డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ల సందర్భాల్లో ఆయా పోస్టులకు సంబంధించి అమల్లో ఉన్న గరిష్ట వయో పరిమితిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మాదిరిగానే ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు ఐదేళ్ల వయసు సడలింపు వర్తిస్తుంది.


ప్రత్యక్ష ఎంపికకు సంబంధించిన పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీల మాదిరిగానే అగ్రవర్ణ పేదలకు ఎగ్జామ్‌ ఫీజు మినహాయింపు ఉంటుంది.


తహశీల్దార్‌ జారీచేసే ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే డిస్మిస్‌ చేస్తారు. 


ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కేటాయించిన రిజర్వుడు పోస్టులకు అర్హత గల అభ్యర్థులు లభించకుంటే.. ఆ ఖాళీలను మళ్లీ బ్యాక్‌లాగ్‌ కిందకు చూపరు.


ఈడబ్ల్యూఎస్‌ వర్గాల్లోని దివ్యాంగులు, ఎక్స్‌సర్వీ్‌సమన్లను ఈడబ్ల్యూఎస్‌ రోస్టర్‌ పాయింట్లలోనే భర్తీ చేస్తారు.


అన్‌రిజర్వుడు ఖాళీలకు ఈడబ్ల్యూఎస్‌ వర్గాలు పోటీ పడవచ్చు. వారిని తిరస్కరించడానికి వీల్లేదు. ప్రతిభ ఆధారంగా అన్‌రిజర్వుడు ఖాళీలకు ఎంపికైతే రిజర్వేషన్‌ కోటాను మెరిట్‌నే ప్రాతిపదికగా తీసుకుంటారు.


ప్రాథమిక ఎంపిక సందర్భాల్లో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గాలకు చెందిన మహిళలకు 33 1/3 శాతం మేర రిజర్వేషన్లు అమలవుతాయి.


ప్రతి ఉన్నత విద్యా సంస్థ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల శాతానికి అనుగుణంగా తమ సీట్లను పెంచుకోవాలి. 


ప్రతి 100 సీట్లలో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 9వ, 17వ(మహిళలు), 28వ, 36వ, 50వ(మహిళలు), 57వ, 65వ(మహిళలు), 76వ, 86వ, 100వ రోస్టర్‌ పాయింట్లు వర్తిస్తాయి.

Updated Date - 2021-08-25T16:33:59+05:30 IST