ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నగదు తల్లుల ఖాతాల్లో వేస్తే నష్టమేంటి?

ABN , First Publish Date - 2021-12-28T21:16:13+05:30 IST

విద్యాదీవెన అనేది ప్రభుత్వ పథకమని.. ఏ విధంగా డబ్బులు చెల్లించాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించింది. పథకానికి కేంద్రం నిధులు ఇస్తున్నా.. సింగిల్‌ జడ్జి వద్ద కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చలేదని గుర్తు చేసింది

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నగదు తల్లుల ఖాతాల్లో వేస్తే నష్టమేంటి?

పిటిషనర్లనుద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు

సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే.. విచారణ వాయిదా


అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును కళాశాలల అకౌంట్లలోనే జమ చేయాలని, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి వీల్లేదని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాదీవెన పథకం కళాశాలల కోసం కాదని, విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోతే.. యాజమాన్యానికి ఉన్న హక్కుల మేరకు వాటిని వసూలు చేసుకోవచ్చని తెలిపింది. తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం వల్ల పిటిషనర్ల హక్కులకు ఏ విధంగా భంగం కలుగుతుందో చెప్పాలని ప్రశ్నించింది. 


విద్యాదీవెన అనేది ప్రభుత్వ పథకమని.. ఏ విధంగా డబ్బులు చెల్లించాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించింది. పథకానికి కేంద్రం నిధులు ఇస్తున్నా.. సింగిల్‌ జడ్జి వద్ద కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చలేదని గుర్తు చేసింది. విద్యాదీవెన కింద ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసేలా ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ శ్రీ కృష్ణదేవరాయ యునివర్సిటీ ప్రైవేటు డిగ్రీ కళాశాల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌హెచ్‌ఆర్‌ ప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి విద్యాదీవెన కింద అందించే సొమ్మును తల్లిదండ్రుల  ఖాతాల్లో జమ చేయడాన్ని తప్పుబట్టారు. కళాశాలల అకౌంట్లలోనే జమ చేయాలని ఆదేశించారు. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. ఇది సోమవారం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. 

Updated Date - 2021-12-28T21:16:13+05:30 IST