సౌకర్యాలు లేకుండా బోధన ఎలా?.. 20% బడుల్లో తాగునీరు కరువు

ABN , First Publish Date - 2021-08-25T17:01:26+05:30 IST

వచ్చే నెల ఒకటోతేదీ నుంచి పాఠశాలలను పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర సర్కారు చేసిన ప్రకటనపై పలువురు విద్యావేత్తలు, డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా విద్యార్థులు లేకపోవడంతో దాదాపు 60 శాతం ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని,

సౌకర్యాలు లేకుండా బోధన ఎలా?.. 20% బడుల్లో తాగునీరు కరువు

కొవిడ్‌ బడ్జెట్‌ విడుదల చేసిన తర్వాతే క్లాసులు పెట్టాలి

పాఠశాలల పునఃప్రారంభంపై పలువురు విద్యావేత్తల మనోగతం


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల ఒకటోతేదీ నుంచి పాఠశాలలను పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర సర్కారు చేసిన  ప్రకటనపై పలువురు విద్యావేత్తలు, డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా విద్యార్థులు లేకపోవడంతో దాదాపు 60 శాతం ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని, ఫర్నిచర్‌ ధ్వంసమైందని, వర్షాలకు పైకప్పులు ప్రమాదకరంగా మారాయని   గుర్తుచేస్తున్నారు. చాలా బడుల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో హడావుడిగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించడం సరికాదని పేర్కొంటున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలను సందర్శించి సమస్యలను పరిష్కరించిన తర్వాతేపిల్లలను బడికి రప్పించడం శ్రేయస్కరమని చెబుతున్నారు. ఇటీవల తాము గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు 20 శాతం బడుల్లో తాగునీటి సౌకర్యం, 28ు బడుల్లో మరుగుదొడ్లు లేనట్టు గుర్తించామని ఉస్మానియా వర్సిటీ మాజీ డీన్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు తెలిపారు. బిల్లులు కట్టకపోవడంతో 15ు స్కూళ్లకు కరెంటు సరఫరా నిలిపివేసినట్టు చెప్పారు. ఇన్ని సమస్యలున్న ప్రభుత్వ పాఠశాలలను హడవుడిగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొలుత బడుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 


విద్యార్థులు వైరస్‌ బారిన పడకుండా రోజూ తరగతి గదులను, బెంచీలను శానిటైజ్‌ చేయించాలని.. నిత్యం మాస్కులు అందజేయాలని, ఇందుకోసం బడ్జెట్‌ విడుదల చేయాలని సూచించారు. మరోవైపు.. గ్రామీణ ప్రాంతాల పిల్లలు, మురికివాడల్లోనివారు ఆన్‌లైన్‌ క్లాసులు పక్కకుపెట్టి కూలిపనులకు వెళ్తున్నారని, బడులు లేకపోవడంతో 15 ఏళ్లలోపు అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తున్నారని సోషల్‌ డెమొక్రటిక్‌ ఫోరానికి చెందిన సూరేపల్లి సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా అన్ని క్లాసులకూ ప్రత్యక్ష తరగతులు ప్రారంభించడం మంచిదేనని స్పష్టం చేశారు. ఆలోగా ప్రైవేటు బడుల్లో మాదిరిగానే సర్కారీ బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యాబోధన చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


పాఠశాలలను ప్రారంభిస్తున్న ప్రభుత్వం.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆలిండియా సేవ్‌ ఎడ్యుకేషన్‌ కమిటీకి చెందిన తేజ సూచించారు. పిల్లలకు చదువు ముఖ్యమేగానీ.. అంతకంటే ఎక్కువగా వారి ప్రాణాలు కాపాడడం ముఖ్యమని, ఈ రెండింటినీ సమానంగా చూసుకుంటూ ముందుకుసాగాలని   సూచించారు. అపోలో ఆస్పత్రికి చెందిన జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ అనీష్‌ ఆనంద్‌ వంటి కొందరు వైద్యనిపుణులు మాత్రం స్కూళ్లు ఇప్పుడే తెరవొద్దని హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరులో కొవిడ్‌ మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్న ఈ సమయంలో పాఠశాలలను ప్రారంభించాలన్న నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘‘భారీగా వ్యాక్సినేషన్‌ జరిగిన అమెరికాలో నాలుగు నెలల క్రితం పాఠశాలలను ప్రారంభించారు. ఇటీవల అక్కడ రోజుకు 1000-1500 మంది పిల్లలు కొవిడ్‌ బారిన పడుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న టీచర్లు సైతం కరోనా బారిన పడుతున్నారు.


ఇటీవల అక్కడ ముగ్గురు టీచర్లు మృతిచెందినట్లు తెలిసింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని స్కూళ్లు ఇప్పుడు తెరకపోవడం మంచిదని నా అభిప్రాయం’’ అని వివరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ‘‘తెలంగాణ తల్లిదండ్రుల సంఘం’’ రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ పేర్కొన్నారు. అయితే.. స్కూళ్లల్లో కొవిడ్‌ జాగ్రత్తలపై విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని, ప్రైవేట్‌ బడుల్లో నెలవారీ ట్యూషన్‌ ఫీజు మాత్ర మే తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

Updated Date - 2021-08-25T17:01:26+05:30 IST