తెలుగులో ‘ఇంజనీరింగ్’
ABN , First Publish Date - 2021-07-31T16:47:39+05:30 IST
ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సుల బోధన దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇంజనీరింగ్ కోర్సుల పుస్తకాలను స్థానిక భాషల్లోకి తర్జుమా చేయడానికి ‘భాషానువాద కృత్రిమ మేథా ఉపకరణం’ (ఏఐఎల్‌టీటీ)ను
ఆంగ్లం నుంచి పుస్తకాల అనువాదం
కృత్రిమ మేథతో మొత్తం 12 భాషల్లోకి
ఏపీవాసి బుద్దా చంద్రశేఖర్ టూల్ రూపకల్పన
ప్రధాని మోదీ ఆవిష్కరణ.. స్థానిక భాషల్లో బోధన
న్యూఢిల్లీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సుల బోధన దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇంజనీరింగ్ కోర్సుల పుస్తకాలను స్థానిక భాషల్లోకి తర్జుమా చేయడానికి ‘భాషానువాద కృత్రిమ మేథా ఉపకరణం’ (ఏఐఎల్‌టీటీ)ను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చీఫ్ కో-ఆర్డినేటింగ్ అధికారి బుద్దా చంద్రశేఖర్ రూపొందించిన ఈ టూల్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. దీని ద్వారా ఇంగ్లిషు పుస్తకాన్ని పేజీల వారీగా 12 భాషల్లోకి అనువదించవచ్చు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, గుజరాతీ, ఒడియా, మరాఠీ, మలయాళం, బంగ్లా, అస్సామీ, పంజాబీ, ఉర్దూ భాషల్లోకి పుస్తకాలను అనువదించేందుకు ప్రస్తుతం అవకాశం కల్పించారు. అనువాదం అయిన దానిలో ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఎడిట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని తప్పును సరిదిద్దుకోవచ్చు. స్పీచ్ రికార్డర్ ద్వారా కూడా ఎడిట్ చేసుకోవడంతో పాటు దాన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు. అనువాద టూల్ రూపకర్త బుద్దా చంద్రశేఖర్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో చదువుకుని ఉన్నత విద్య ఇంగ్లిషు మీడియంలో మాత్రమే చదువుకోవాల్సి రావడం వల్ల డ్రాపవుట్ రేటు ఎక్కువవుతోందని అన్నారు. ఇంగ్లిష్ పుస్తకాన్ని స్థానిక భాషల్లోకి అనువదించేందుకు వీలుగా ఈ టూల్‌ను రూపొందించామని చెప్పారు. 90 శాతం కచ్చితత్వంతో అనువాదం అవుతాయని తెలిపారు. ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లొమాకు సంబంధించి దాదాపు 600 పుస్తకాలను తర్జుమా చేశామని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులను బోధించడానికి దేశవ్యాప్తంగా 14 ఇంజనీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయని, అందులో రెండు కాలేజీలు తెలుగులో బోధనకు సానుకూలత వ్యక్తం చేశాయని పేర్కొన్నారు.