విద్యా చట్టాన్ని అమలు చేస్తారా.. లేదా?

ABN , First Publish Date - 2021-02-05T16:49:50+05:30 IST

రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్యాచట్టం కింద అర్హులైన పేద, బలహీనవర్గాల విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో 25శాతం సీట్లను

విద్యా చట్టాన్ని అమలు చేస్తారా.. లేదా?

పేదల కోసం సర్కారు ఈ మాత్రం చేయలేదా?

చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత: హైకోర్టు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్యాచట్టం కింద అర్హులైన పేద, బలహీనవర్గాల విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో 25శాతం సీట్లను కేటాయించేలా ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన జీవో 44ను ఇంకెప్పుడు అమలు చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2009లో కేంద్రం తెచ్చిన ఆర్టీఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తారో... లేదో? జూన్‌ 13లోగా చెప్పాలని, ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది.


ఆర్టీఈ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వనపర్తి జిల్లాకు చెందిన వై.తిప్పారెడ్డి అనే వ్యక్తి హైకోర్టు సీజేకు రాసిన లేఖను ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ సంజీవ్‌కుమార్‌ వాదిస్తూ... ఆర్టీఈ చట్టాన్ని అమలు చేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2010 జూలైలో ప్రభుత్వం జీవో 44 తెచ్చిందన్నారు. ఈ జీవోను సవాల్‌ చేస్తూ నలందా ఎడ్యుకేషన్‌ సొసైటీ హైకోర్టును ఆశ్రయించి స్టే ఆదేశాలు పొందినట్లు తెలిపారు.  ఈ వాదనలపై స్పందించిన సీజే హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం స్టేను తొలగించేందుకు ఏపీ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌ ఎందుకు వేయలేదని స్పెషల్‌ జీపీని ప్రశ్నించింది. ఈ ఘటనను బట్టి ప్రభుత్వ ఉదాసీనత అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. పేద, బలహీనవర్గాల విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ మాత్రం కూడా చేయలేదా..? అని ప్రశ్నించింది. 

Updated Date - 2021-02-05T16:49:50+05:30 IST