మాకు భయమేస్తోంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదు..!
ABN , First Publish Date - 2021-10-29T14:23:58+05:30 IST
మాకు భయమేస్తోంది..
మా బడి మూయొద్దు
భీమవరంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
కొనసాగుతున్న ఎయి‘డెడ్’ నిరసనలు
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ పాఠశాలలను మూసేయొద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుక్కుతున్నారు. విద్యాసంస్థల ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు విద్యార్థి, యువజన సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగడుతూ రౌండ్‌టేబుల్ సమావేశాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బీసీహెచ్‌బీఆర్‌ఎం ఎయిడెడ్ పాఠశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు గురువారం ఆందోళన నిర్వహించారు. ‘విద్యా సంవత్సరం మొదలై మూడు నెలలవుతోంది. ఇప్పుడు స్కూల్ మారుస్తాం అంటున్నారు. మధ్యలో వేరే స్కూల్‌కు వెళ్లి చదువుకోవాలంటే మాకు భయమేస్తోంది. పాఠశాల మూసివేతకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదు’ అంటూ పాఠశాల ఎదుట వారంతా బైఠాయించారు. ఆందోళనలో వీరితోపాటు ఎస్‌ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. పాఠశాలలో 377 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దూరంగా ఉన్న జేఎల్‌బీ పాఠశాల లేదా చినఅమిరం పాఠశాలకు వెళ్లాలని చెబుతున్నారని, ఆ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున తరగతి గదులు ఇరుకుగా ఉంటాయని తల్లిదండ్రులు అంటున్నారు.
ఎయిడెడ్ స్కూళ్లను కొనసాగించాల్సిందే..
ఏడు దశాబ్దాలకుపైగా సజావుగా నడుస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలను మూసివేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, యథావిధిగా కొనసాగించాల్సిందేనని వక్తలు డిమాండ్ చేశారు. విజయవాడలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి గన్ని రాజు, టీఎన్‌ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యరావు నాగూర్ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.