డిగ్రీ ఫీజులు నిర్ణయించేదెవరు?

ABN , First Publish Date - 2021-01-13T15:25:04+05:30 IST

ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల ఫీజు నిర్ణయించేది ఎవరు? విశ్వవిద్యాలయాలా? ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషనా(ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ)

డిగ్రీ ఫీజులు నిర్ణయించేదెవరు?

వర్సిటీ చట్టం-1991 ప్రకారం వర్సిటీలదే

చట్టాన్ని కాదని.. కమిషన్‌ నిర్ణయం

ప్రైవేట్‌ కాలేజీల కేటగిరీల్లోనూ లోపాలే!

నాక్‌-ఏ, అటానమస్‌ కాలేజీలు ‘సీ’లోకి

అద్దె భవనాలు, ‘నాక్‌’ గ్రేడ్‌ లేనివి ‘ఏ’లోకి

రెగ్యులేటరీ కమిషన్‌ తీరుపై విస్మయం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల ఫీజు నిర్ణయించేది ఎవరు? విశ్వవిద్యాలయాలా? ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషనా(ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ)? అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ యూనివర్సిటీల చట్టం-1991లోని సెక్షన్‌-19(13) ప్రకారం కాలేజీల ఫీజు నిర్ణయించాల్సింది సంబంధిత విశ్వవిద్యాలయాలే. అంతేకాదు, చట్టంలోని సెక్షన్‌ 19(బీ) ప్రకారం.. ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ కేవలం పర్యవేక్షణ, నియంత్రణకు పరిమితం కావాలి. అయితే, కమిషన్‌ రూల్‌(8) ప్రకారం తన చట్టాన్ని కాదని డిగ్రీ కాలేజీల ఫీజులను సిఫారసు చేయగా ప్రభుత్వం ఆమోదించి ఉత్తర్వులు జారీచేసింది. కమిషన్‌ తన చట్టానికి విరుద్ధంగా రూల్స్‌ రాసుకోవడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలకు తమంతట తాముగా ఫీజులను నిర్ణయించుకునే అధికారం లేదు.


సంబంధిత విశ్వవిద్యాలయాలు నిర్ణయించిన ఫీజులనే అమలు చేయాలి. కానీ, అందుకు విరుద్ధంగా మీ కాలేజీల ఫీజుల వివరాలు పంపించమని అడగటం, విచారించడం, ఫీజులు నిర్ణయించడం వంటివి జరిగిపోయాయి. వాస్తవానికి విశ్వవిద్యాలయాలతో రెగ్యులేటరీ కమిషన్‌ సంప్రదింపులు జరపాల్సి ఉంది. వర్సిటీలను కాదని నేరుగా కాలేజీలను సంప్రదించి ఫీజులు నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. రెగ్యులేటరీ కమిషన్‌ చట్టం, యూనివర్సిటీల చట్టాలు వేర్వేరు. వర్సిటీల చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర గవర్నర్‌కు మాత్రమే ఉంటుంది. కమిషన్‌ తన చట్టం ప్రకారం.. వర్సిటీ పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే గవర్నర్‌ పాత్ర ప్రశ్నార్థకం అవుతుంది. కమిషన్‌ చట్టం ప్రకారం.. ఫీజుల్లో హెచ్చు తగ్గులను నియంత్రించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. ఇది కేవలం వర్సిటీలతో సంప్రదించి మాత్రమే చేయాలి. అలాగే ఫీజులు ఎలా ఉన్నాయో? ఎలా అమలవుతున్నాయో? పర్యవేక్షించే అధికారం ఉంటుంది. కానీ, నేరుగా ఫీజులే నిర్ణయిస్తూ సిఫారుసులు చేయడం వివాదానికి దారితీసింది. 


కేటగిరీ విభజనా వివాదమే!

ఇక, ప్రైవేటు డిగ్రీ కాలేజీలను మూడు కేటగిరీలు(ఏ,బీ,సీ)గా విభజించిన అంశం కూడా వివాదానికి దారితీసింది. ఇలా.. కాలేజీల విభజనకు ప్రాతిపదిక ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, కేటగిరీల విభజనలో అసమానతలు వెలుగు చూస్తున్నాయి. నాక్‌-ఏ గ్రేడ్‌, అటానమస్‌ హోదా, సొంత భవనాలున్న కాలేజీలను ‘సీ’ కేటగిరీలోకి, అద్దె భవనాలు, ‘నాక్‌’ గ్రేడ్‌ లేని కాలేజీలను ‘ఏ’ కేటగిరీలోకి తీసుకోవడంతో రెగ్యులేటరీ కమిషన్‌ తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. 2004లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. 10 ఏళ్లు దాటి అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీలను మూసేయాల్సి ఉంది. ఆ ఉత్తర్వులను అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ, రెగ్యులేటరీ కమిషన్‌ హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఇప్పటికీ అద్దె భవనాల్లో నడుస్తున్న కాలేజీలకు ‘ఏ’ కేటగిరీ ఇచ్చి మరీ ఇతర కాలేజీల కంటే అధిక ఫీజులు సిఫారసు చేయడం గమనార్హం. విశాఖపట్నంలోని ‘యూనిటీ’ డిగ్రీ కాలేజీ విషయంలో ఇదే జరిగినట్లు సమాచారం. డిగ్రీ కాలేజీల కేటగిరీలపై తక్షణమే విచారణ జరిపిస్తే మరిన్ని అసమానతలు వెలుగుచూసే అవకాశం ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. డిగ్రీ కాలేజీల ఫీజుల్లో అసమానతలపై, కాలేజీల కేటగిరీలపై న్యాయస్థానంలో పడుతున్న కేసులపై ఈ నెల 18న విచారణ జరగనుంది. 


కేటగిరీల్లో అసమానతలు ఇవీ..

నాక్‌-‘ఏ’ గ్రేడ్‌ కలిగి, అటానమస్‌ హోదాతో పాటు కాలేజ్‌ ఫర్‌ పొటెన్షియల్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ సాధించి,  శాశ్వత భవనాల్లో ఉత్తమ ప్రమాణాలతో నడుస్తున్న విజయవాడలోని కేబీఎన్‌ డిగ్రీ కాలేజీ, కాలేజ్‌ విత్‌ ఎక్స్‌లెన్స్‌ ఉన్న ఏలూరులోని సెయింట్‌ థెరిస్సా డిగ్రీ కాలేజీలకు ‘సీ’ కేటగిరీ ఇచ్చి తక్కువ ఫీజు సిఫారసు చేశారు.


నాక్‌-‘బీ’ గ్రేడ్‌, అటానమస్‌ ఉన్న గుంటూరు లోని జేకేసీ డిగ్రీ కాలేజీ, కర్నూలులోని సెయింట్‌ జోసఫ్‌ డిగ్రీ కాలేజీలను ‘బీ‘ కేటగిరీలో చేర్చారు.


దీర్ఘకాలంగా అద్దెభవనాల్లో నడుస్తున్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ బడా గ్రూపు డిగ్రీ కాలేజీలకు ఏ, బీ కేటగిరీ, ప్రకాశం జిల్లాలోని కొన్ని డిగ్రీ కాలేజీలకు ‘ఏ’ కేటగిరీ ఇచ్చి ఎక్కువ ఫీజు సిఫారసు చేశారు.


Updated Date - 2021-01-13T15:25:04+05:30 IST