ముగిసిన డెడ్‌లైన్‌.. నేటి నుంచే పోరుబాట

ABN , First Publish Date - 2021-12-07T13:42:57+05:30 IST

తమ సమస్యలను..

ముగిసిన డెడ్‌లైన్‌.. నేటి నుంచే పోరుబాట

రాష్ట్ర ఉద్యోగుల ఉద్యమ పథం

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

10 తర్వాత మరింత తీవ్రం

ఎస్మా ప్రయోగించినా ఉద్యమం ఆగదు: ఉద్యోగ నేతలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఉద్యోగులు ఆశించారు. కొన్నాళ్లుగా ప్రభుత్వం నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా భరించారు. కానీ.. ప్రభుత్వ పెద్దల మనసు కరగలేదు. దీంతో తమ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ జేఏసీలు(ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి) పిడికిలి బిగించాయి.


రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిరసనబాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ నేటి నుంచి పలు రూపాల్లో ఆందోళన చేయనున్నారు. ఇటీవల అమరావతి సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన కార్యదర్శుల సమావేశంలో కూడా ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పష్టతా రాలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం 3 జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించింది. ప్రతి సమావేశంలోనూ సంఘాలు 11వ పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేసినా.. ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా, ఇటీవల పీఆర్సీపై సంప్రదింపులకు పిలిచి అసలు పీఆర్సీ అంశమే లేవనెత్తలేదు. ఈ నేపథ్యంలో ఉద్యమంతో తప్ప.. తమ సమస్యలకు పరిష్కారం లభించదని ఉద్యోగ సంఘాలు భావించాయి. దీంతో కొన్ని వారాల కిందటే ఉద్యమం తప్పదంటూ.. ప్రకటించాయి.


అయినా ప్రభుత్వం స్పందించక పోవడంతో ఉద్యమ కార్యాచరణ అమలుకు జేఏసీలు సిద్ధమయ్యాయి. 11వ పీఆర్సీని వెంటనే ప్రకటించడంతోపాటు, డీఏల విడుదల, సీపీఎస్‌ రద్దు, పీఎఫ్‌ రుణాల మంజూరు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగ జేఏసీలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. జిల్లాల వారీగా నేతలు ఇప్పటికే తమ సంఘాలను సమాయత్తం చేశారు. జేఏసీల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. ఉద్యమ అవసరాన్ని, ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఇవ్వని పరిస్థితిని ఉద్యోగులకు వివరిస్తున్నారు. ఎన్నాళ్లు వేచి చూసినా ఉద్యోగుల సమస్యలపై కనీస స్పందన కూడా లేదని ఈ క్రమంలోనే ఉద్యమించక తప్పని పరిస్థితి వచ్చిందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు.  


ఓర్పు వహించినా.. 

ఉద్యోగుల వేతన సవరణపై ప్రభుత్వం రెండున్నరేళ్లుగా చేస్తున్న కాలయాపనపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 11వ వేతన సవరణ సంఘం 2018లో ఏర్పాటై.. ప్రభుత్వానికి నివేదిక అందినా దానిని ఉద్యోగులకు అందించకుండా తాత్సారం చేశారు. డీఏలను విడతల వారీగా వేసి ఇస్తామన్నా ఉద్యోగులు ఓర్పుపట్టారు. 2018, 2019 డీఏలను ప్రభుత్వం విడుదల చేసినా ఇప్పటికీ ఎరియర్స్‌ చెల్లింపులు జరగలేదు. ఇంకా ప్రభుత్వం ఉద్యోగులకు 7 డీఏలు  చెల్లించాల్సి ఉంది. మరోవైపు ప్రతి నెలా వేతనాలు చెల్లించే పరిస్థితి దారుణంగా తయారైంది. గతంలో ప్రతినెలా 1న వేతనాలు చెల్లించేవారు.  రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎప్పుడు వేతనాలు పడతాయో ఎదురు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. 


పీఆర్సీపై ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావులు అనేక సార్లు ప్రభుత్వ పెద్దలను, ఉన్నతాధికారులను కలిసి 11 పీఆర్సీ వెంటనే ఇవ్వాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అదేసమయంలో సీఎం జగన్‌ సహా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను, ఆర్థికశాఖ అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల స్వయంగా అక్టోబరు నెలాఖరులోగా పీఆర్సీ సంగతి తేల్చేస్తామని ప్రకటన ఇచ్చినా ఫలితం లేదు. గత నెలలో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలో ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక ఇస్తామన్న సీఎస్‌ ఆ నివేదికను రెండు సమావేశాలు అయినా అందజేయలేదు. అంతేకాదు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీఆర్సీ నివేదిక అధ్యయనంపై అధికారుల కమిటీ ఉందని ఆ కమిటీ అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. ఇలా ఉద్యోగులు, సంఘాల నాయకులు ఎంతో ఓర్పు వహించినా ప్రభుత్వం మాత్రం వారిని ఏ మాత్రం పట్టించుకోలేదు.


సీపీఎస్‌ రద్దు ఏదీ?

గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్‌.. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే  ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. అసలు సీపీఎస్‌ రద్దు మాటే రెండున్నరేళ్లలో ఏ అధికారి నుంచీ వినిపించలేదు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలూ పరిష్కరించలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రిటైర్డు ఉద్యోగులకు సకాలంలో పింఛను అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ ఉద్యమానికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కనిపించలేదు. 


నిరసనలు ఇలా..

మంగళవారం నుంచి 10వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, తాలుకా, డివిజన్లు, జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో  హెచ్‌వోడీలు, ఏపీఎస్‌ ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు.


- 10వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేస్తారు.

- 13 తేదీన అన్ని తాలుకాలు, డివిజన్లలో, బస్సు డిపోల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేపడతారు.

- 16న అన్ని డివిజన్లలోని హెచ్‌వోడీలు, తాలుకా కేంద్రాల్లో,  డిపోల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాలు. 

- 21న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడతారు.

- 27న విశాఖపట్నం, 30న తిరుపతి, జనవరి 3న ఏలూరు, 6న ఒంగోలులో డివిజనల్‌ సమావేశాలు నిర్వహిస్తారు.


ఎస్మా ప్రయోగించినా ఉద్యమం ఆగదు

ఉద్యోగులపై ప్రభుత్వం కన్నెర్ర చేసి ఎస్మా ప్రయెగించినా ఉద్యమం ఆగదని బండి శ్రీనివాసరావు చెప్పారు. 70 ఏళ్లనుంచి వివిధ సమస్యలపై ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నారని, గతంలో ఉద్యోగులపై కాల్పులు జరిపిన సంఘటనలు కూడా ఉన్నాయని అయినా తగ్గలేదన్నారు. అంతవరకు పోకుండా ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సీఎం సానుకూలంగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.


ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రకటన 

అమరావతి(ఆంధ్రజ్యోతి): ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక తలపెట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ఏపీ ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శోభన్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రెజరీ ఉద్యోగులు కూడా నిరసన వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. ఉద్యమానికి తమ సంఘం మద్దతు ఇవ్వడం లేదంటూ సంఘం నుంచి బయటకు వెళ్లిపోయిన వ్యక్తి ఇచ్చిన లేఖను విశ్వసించవద్దని కోరారు. మరోవైపు.. ఈ ఉద్యమానికి దూరంగా ఉంటున్నట్టు ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరం తెలిపింది. సీఎం జగన్‌పై తమ సంఘానికి పూర్తి విశ్వాసం ఉందని తెలిపింది. 

Updated Date - 2021-12-07T13:42:57+05:30 IST