66 మంది వైద్య విద్యార్థులకు Corona

ABN , First Publish Date - 2021-11-26T13:32:59+05:30 IST

కర్ణాటకలోని..

66 మంది వైద్య విద్యార్థులకు Corona

కర్ణాటకలో ఘటన.. అంతా టీకా పొందినవారే


బెంగళూరు, నవంబరు 25: కర్ణాటకలోని ధార్వాడలో ఉన్న శ్రీధర్మస్థల మంజునాథేశ్వర మెడికల్‌ కాలేజీ విద్యార్థులు 66 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వీరంతా టీకా రెండు డోసులూ పొందినవారే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఐఐఎంలో చదువుతున్న మరో ముగ్గురు సైనిక అధికారులకు పాజిటివ్‌ వచ్చింది. వీరూ టీకా పూర్తిగా తీసుకున్నవారే. ఒడిసాలోని విమ్సార్‌ వైద్య కళాశాలలో మరో 20 మందికీ వైరస్‌ నిర్ధారణ అయింది. ధార్వాడలో, విమ్సార్‌లో విద్యార్థులు కళాశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నాకే వైరస్‌కు గురయ్యారు.  


10 మ్యుటేషన్లతో దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌

దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ మరో వేరియంట్‌ (బి.1.1529) వెలుగుచూసింది. అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్న డెల్టాలో 2  మ్యుటేషన్లే ఉండగా.. బి.1.1529లో 10 ఉండడంతో కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై చర్చించేందుకు  డబ్ల్యూహెచ్‌వో గురువారం సమావేశమైంది. దక్షిణాఫ్రికాలో 22 కేసులు నమోదవగా.. వీరిలో యువతే ఎక్కువ. ఇక్కడినుంచి వెళ్లినవారి ద్వారా బోట్స్‌వానా, హాంకాంగ్‌లోనూ వ్యాపించింది. 


రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌తో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్‌ నుంచి వచ్చేవారికి కచ్చితంగా పరీక్షలు చేయాలని సూచించింది. సెకండ్‌ వేవ్‌ సమయంలో.. కొవాక్సిన్‌ టీకా సామర్థ్యం 50 శాతమేనని లాన్సెట్‌ అధ్యయనంలో తేలడం పట్ల ఆశ్చర్యపోవాల్సినదేమీ లేదని పలువురు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 2,714 మంది ఢిల్లీ ఎయిమ్స్‌ సిబ్బందిపై ఏప్రిల్‌, మేలో సర్వే చేశారని.. నాడు డెలా ఉధృతి  ఏ స్థాయిలో సాగిందో గుర్తించాలని పేర్కొన్నారు. కొవిడ్‌ టీకాల కొనుగోలు కోసం భారత్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)  రూ.11,185 కోట్లు  రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

Updated Date - 2021-11-26T13:32:59+05:30 IST