ఉత్తీర్ణత శాతం తగ్గడానికి.. ప్రధాన కారణమిదే..!

ABN , First Publish Date - 2021-12-17T16:11:01+05:30 IST

కరోనా వైరస్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్థులపై ప్రభావం చూపింది. గతంతో పోలిస్తే, ఫస్టియర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల మొదటి ఏడాదికి సంబంధించిన పరీక్ష ఫలితాలను..

ఉత్తీర్ణత శాతం తగ్గడానికి.. ప్రధాన కారణమిదే..!

‘ఇంటర్‌’కు కరోనా దెబ్బ!

మొదటి ఏడాదిలో గణనీయంగా తగ్గిన ఉత్తీర్ణత

కేవలం 49 శాతం విద్యార్థులే పాస్‌

పది శాతానికిపైనే పడిపోయిన ఉత్తీర్ణత 

ఫలితాల్లో మరోసారి బాలికల పైచేయి

బాలికలు 56%.. బాలురు 42 శాతమే

అగ్రస్థానంలో మేడ్చల్‌.. దిగువన మెదక్‌

ఎంపీసీలో అత్యధిక మార్కులు 467

రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు 22 వరకూ 

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల వెల్లడి


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్థులపై ప్రభావం చూపింది. గతంతో పోలిస్తే, ఫస్టియర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల మొదటి ఏడాదికి సంబంధించిన పరీక్ష ఫలితాలను గురువారం అధికారులు వెల్లడించారు. ఈ ఫలితాల్లో 49 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదైంది. బాలికలు 56 శాతం ఉత్తీర్ణతను సాధించగా.. బాలురు కేవలం 42 శాతం మాత్రమే పాసయ్యారు. బాలుర కన్నా బాలికలు 14 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు.


జిల్లాలవారీగా తీసుకుంటే.. 63 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 61 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా రెండో స్థానం, 60 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మూడో స్థానం సాధించింది. ఇక, 20 శాతం ఉత్తీర్ణతతో మెదక్‌ జిల్లా చివరి స్థానంలో నిలవగా, వికారాబాద్‌ జిల్లా 27 శాతం ఉత్తీర్ణతతో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులు సత్తా చాటారు. ఇక, బైపీసీలో ప్రైవేటు విద్యార్థులు అత్యధికంగా 438 మార్కులు సాధిస్తే.. టీఎ్‌సఆర్జేసీ విద్యార్థులు 434; సోషల్‌, బీసీ వెల్ఫేర్‌, మోడల్‌ స్కూల్‌, టీఎంఆర్జేసీ విద్యార్థులు 433 మార్కుల చొప్పున సాధించారు. 


ఇంటర్‌ సెకండియర్‌లోని విద్యార్థులకు ఫస్టియర్‌ పరీక్షలను అక్టోబరు 25 నుంచి నవంబరు 3 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షలను నిర్వహించారు. వాటి ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,59,242 మంది విద్యార్థులు ఫస్టియర్‌ పరీక్షలు రాశారు. వారిలో 2,24,012 విద్యార్థులు పాసయ్యారు. అలాగే.. 2,35,230 మంది ఫెయిలైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://examresults.ts.nic.in, https://results.cgg.gov.in అనే వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చని తెలిపారు. శుక్రవారం (ఈనెల 17వ తేదీ) సాయంత్రం 5 గంటల నుంచి ఫొటో, సంతకాలతో కూడిన మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.


తగ్గిన ఉత్తీర్ణత

గతంతో పోలిస్తే.. ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిపోయింది. 2018లో ఇంటర్‌ ఫస్టియర్లో 62.35 శాతం మంది; 2019లో 60.47 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీటితో ప్రస్తుత ఫలితాలను పోలిస్తే దాదాపు పది శాతానికిపైనే తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందుకు ప్రధాన కారణం.. కరోనా ప్రభావమేనని అంచనా వేస్తున్నారు. గత ఏడాది పరీక్షల్లేకుండా పదో తరగతిలో అందరినీ పాస్‌ చేసేశారని, వారంతా పబ్లిక్‌ పరీక్షలు రాయడం ఇదే తొలిసారని, ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


అధికారుల్లో సమన్వయ లోపం!

ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయడంలో అధికారుల మధ్య సమన్వయం లోపించింది. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయి కూడా 20 రోజులపైనే కావస్తోంది. అయితే.. వొకేషనల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించడానికి వీలుగా కొన్ని రోజులపాటు ఫలితాలను ఆపాల్సి వచ్చింది. అవి పూర్తయిన తర్వాత కూడా ఫలితాల వెల్లడిలో మరికొంత జాప్యం చోటు చేసుకుంది. ఇందుకు విద్యా శాఖలోని ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమనే వాదన వినిపిస్తోంది. ఉదాహరణకు, ఫలితాలను గురువారం ప్రకటించాలని బుధవారం నిర్ణయించారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే ఈ నిర్ణయం జరిగింది. ఆ సమయంలో ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.


కానీ, ఫలితాలను వెల్లడిస్తున్నట్లు మాత్రం ఎవరూ ప్రకటించలేదు. ఆఖరికి గురువారం ఫలితాలను ప్రకటించే వరకూ కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మంత్రి ఆమోదం తెలిపిన తర్వాత ఇంటర్‌ అధికారులు నేరుగా ఫలితాలను ప్రకటిస్తే సరిపోయేదని, అలా కాకుండా కార్యదర్శి అనుమతి కోసం ప్రయత్నం చేశారని, ఆయన కొంత సమయం అడిగినట్టు తెలిసింది. దాంతో, ఫలితాలను గురువారం వెల్లడిస్తారా? లేదా? అన్న చర్చ జరిగింది. చివరకు, మధ్యాహ్నం తర్వాత అధికారులు తుది నిర్ణయం తీసుకుని, వెబ్‌సైట్లోనే ఫలితాలను విడుదల చేశారు.


వొకేషనల్‌ కోర్సుల్లో 49 శాతం ఉత్తీర్ణత

వొకేషనల్‌ కోర్సుల్లో 49 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లోనూ 62 శాతం ఉత్తీర్ణతతో బాలికలే సత్తా చాటారు. బాలురు 39%  పాసయ్యారు.


విద్యార్థుల్లో మానసిక స్థెర్యాన్ని నింపేందుకు, ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడేందుకు ఇంటర్‌ బోర్డు 7 హెల్ప్‌ లైన్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు 91549 51704/977/695/699/703/706/ 687 తదితర నంబర్లను సంప్రదించి క్లినికల్‌ సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్‌ పొందవచ్చు.


రీ వెరిఫికేషన్‌కు 22 వరకూ గడువు

రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. రీ కౌంటింగ్‌ కోసం పేపర్‌కు రూ.100, స్కాన్డ్‌ కాపీతోపాటు రీ వెరిఫికేషన్‌ కోరుకునే విద్యార్థులు పేపర్‌కు రూ.600 ఫీజు చెల్లించాలని తెలిపారు. నిర్ణీత రుసుము చెల్లించి ఈనెల 22వ తేదీలోగా https://tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.


హ్యుమానిటీస్‌ కోర్సుల్లో తక్కువ శాతం పాస్‌

కోర్సుల వారీగా తీసుకుంటే హ్యుమానిటీస్‌ కోర్సులైన హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి కోర్సుల్లోనే అత్యధికులు ఫెయిలయ్యారు. ఈ కోర్సుల్లో 50 శాతం మాత్రమే ఉత్తీర్ణులవగా, ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ఉత్తీర్ణత మెరుగ్గానే ఉంది. ఇక, వోకేషనల్‌ కోర్సుల్లో భాగమైన అగ్రికల్చర్‌ కోర్సుల్లో 52 శాతం, బిజినెస్‌ అండ్‌ కామర్స్‌ కోర్సుల్లో 51, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 39 శాతం, పారామెడికల్‌ కోర్సుల్లో 60 శాతం, హోమ్‌సైన్స్‌, ఇతరత్రా కోర్సుల్లో 67 శాతం పాస్‌ అయ్యారు.

Updated Date - 2021-12-17T16:11:01+05:30 IST