ప్రభుత్వంపై నమ్మకం పోయింది

ABN , First Publish Date - 2021-12-07T15:32:57+05:30 IST

‘‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తోడుగా ఉంటుందని ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. అయితే, ప్రభుత్వ వైఖరితో ఈ నమ్మకాన్ని పూర్తిగా..

ప్రభుత్వంపై నమ్మకం పోయింది

ఉద్యోగులు విసిగి పోయారు.. నేటి నుంచి దశలవారీ ఆందోళన: బొప్పరాజు


కడప, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తోడుగా ఉంటుందని ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. అయితే, ప్రభుత్వ వైఖరితో ఈ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాం’’ అని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 11వ పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, డీఏలు తదితర 71 డిమాండ్ల సాధన కోసం మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సోమవారం కడపలోని ఎన్జీవో కార్యాలయంలో జేఏసీ నేతలు హృదయరాజు, శివారెడ్డిలతో కలిసి బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లపై  సీఎస్‌ నుంచి గానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గానీ స్పందన లేదన్నారు. తిరుపతిలో ఇటీవల సీఎం జగన్‌.. వారం, పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని చెప్పారని, ఈ విషయాన్ని ఆరోజు జరిగిన సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళితే సీఎం వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పారని తెలిపారు. సీపీఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ హామీ ఇచ్చారని, మీరెందుకు అడుగలేదంటూ అన్ని సమస్యలపైనా ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్‌కార్డు అన్‌హెల్త్‌కార్డుగా మారిందని విమర్శించారు.


ఉద్యోగస్తులు మొత్తం పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం రూ.1600 కోట్లకు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదన్నారు. ఉద్యోగస్తులు ప్రభుత్వంలో దాచుకున్న జీపీఎఫ్‌ సహా ఇతర సొమ్ములను డ్రా చేసుకుని ప్రైవేటు బ్యాంకుల్లో జమ చేసుకునే దుస్థితి వచ్చిందన్నారు. సచివాలయ ఉద్యోగులను అక్టోబరు 2న ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్‌ చేయాల్సి ఉందని, అయితే.. ఇప్పుడు రెగ్యులర్‌ కోసం డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖలో 44 యాప్‌లను ప్రవేశపెట్టారని, యాప్‌లతోనే ఉద్యోగుల సమయం సరిపోతుందన్నారు. 98ు ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న 2 జేఏసీ సంఘాలు సమస్యల కోసం ఉద్యమ బాట పడుతుంటే కనీసం ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం కాదా? అని ప్రశ్నించారు. జనవరి 6 వరకు తొలి విడత ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రెండో విడత ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంటుందని బొప్పరాజు హెచ్చరించారు. 

Updated Date - 2021-12-07T15:32:57+05:30 IST