సహోద్యోగి కాల్పులు.. నలుగురు జవాన్ల మృతి

ABN , First Publish Date - 2021-11-09T15:15:15+05:30 IST

దీపావళి సెలవుల విషయంలో..

సహోద్యోగి కాల్పులు.. నలుగురు జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని లింగంపల్లి సీఆర్‌పీఎఫ్‌ బేస్‌ క్యాంపులో ఘటన

ఏకే-47లో తూటాలైపోయే దాకా కాల్చిన జవాన్‌ రీతేశ్‌ రంజన్‌

బ్యారక్‌లో గాఢనిద్రలో ఉన్న జవాన్లపై వేకువజామున ఘాతుకం 

దీపావళి సెలవుల వివాదం నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్లు ప్రచారం


భద్రాచలం/సుక్మా, నవంబరు 8 : దీపావళి సెలవుల విషయంలో ఇటీవల తనతో వాగ్వాదానికి దిగారనే ఆగ్రహంతో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాను తోటి జవాన్లపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో నలుగురు జవాన్లు చనిపోయారు. ఈ ఘటన ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మా జిల్లా మారాయిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో ఉన్న 50వ సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌ క్యాంప్‌లో సోమవారం వేకువజామున 3.25 గంటలకు చోటుచేసుకుంది. సెంట్రీ విధులు నిర్వర్తించేందుకు సిద్ధమైన జవాన్‌ రీతేశ్‌ రంజన్‌ (25).. దాదాపు 45 మంది తోటి జవాన్లు నిద్రిస్తున్న బ్యారక్‌ వద్దకు చేరుకున్నాడు. అర్ధరాత్రి దాకా కూంబింగ్‌ విధులు నిర్వర్తించి వచ్చి నిద్రపోతున్న కొందరు జవాన్లు లక్ష్యంగా తన వద్దనున్న ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. రైఫిల్‌లోని తూటాలు అయిపోయే దాకా అతడు కాల్పులను ఆపలేదని సుక్మా ఎస్పీ సునీల్‌ శర్మ తెలిపారు. తూటాలన్నీ అయిపోయిన తర్వాత అదే బ్యారక్‌లో ఉన్న తోటి జవాన్లు వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని కున్నారని ఆయన చెప్పారు. ఈ కాల్పుల్లో ఏడుగురికి తీవ్ర గాయాలవగా, అత్యవసర చికిత్స నిమిత్తం పొరుగునే ఉన్న తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. 


ముగ్గురు జవాన్లు రాజమణి కుమార్‌ యాదవ్‌ (బిహార్‌), ధాంజి (బిహార్‌), రాజీవ్‌ మండల్‌ (పశ్చిమ బెంగాల్‌) అప్పటికే మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స అందిస్తుండగా మరో జవాను ధర్మేంద్ర కుమార్‌ (బిహార్‌) ప్రాణాలు విడిచాడు. మిగిలిన ముగ్గురు జవాన్లు ధనుంజయ్‌కుమార్‌ సింగ్‌, ధర్మాత్మ కుమార్‌, బగ్‌ మలయారంజన్‌ మహారాణాలను మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో ఛత్తీ్‌సగఢ్‌లోని రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మారాయిగూడ పోలీసులు, కాల్పులు జరిపిన జవాన్‌ రీతేశ్‌ రంజన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడు భావోద్వేగపరమైన ఒత్తిడికి లోనవడం వల్లే ఈవిధంగా కాల్పులు జరిపి ఉండొచ్చని సీఆర్‌పీఎఫ్‌ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. బిహార్‌లోని జహానాబాద్‌కు చెందిన రీతేశ్‌ ఈనెల 13 నుంచి సెలవులపై ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతిపై ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘెల్‌ విచారం వ్యక్తం చేశారు. దీన్ని దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు.

Updated Date - 2021-11-09T15:15:15+05:30 IST