అణునిర్మాణంలో వినూత్న విధాన రూపకర్తలకు రసాయన నోబెల్‌

ABN , First Publish Date - 2021-10-07T12:50:50+05:30 IST

అణువుల నిర్మాణానికి..

అణునిర్మాణంలో వినూత్న విధాన రూపకర్తలకు రసాయన నోబెల్‌

అసిమెట్రిక్‌ ఆర్గనోకెటలిసిస్‌ విధానాన్ని అభివృద్ధి చేసిన బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిలన్‌కు ప్రకటించిన కమిటీ

ఔషధాల ఉత్పత్తిని వేగవంతం చేయడంలో కీలకపాత్ర


స్టాక్‌హోం, అక్టోబరు 6: అణువుల నిర్మాణానికి సంబంధించి ‘అసిమెట్రిక్‌ ఆర్గనోకెటలిసిస్‌’ అనే వినూత్న విధానాన్ని అభివృ ద్ధి చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ఈ ఏటి కెమిస్ట్రీ (రసాయనశాస్త్ర) నోబెల్‌ పురస్కారం లభించింది. బహుమతి మొత్తాన్ని జర్మనీకి చెందిన బెంజమిన్‌ లిస్ట్‌(53), స్కాట్‌లాండ్‌కు చెందిన డేవిడ్‌ మెక్‌మిలన్‌(53) సమానంగా పంచుకోనున్నారు. వీరి ఆవిష్కరణ సౌరఫలకాలను మరింత మెరుగుపరచడానికి.. టామిఫ్లూ వంటి యాంటీవైరల్‌ మందులు, యాంటీ డిప్రెసెంట్‌ మందు పాక్సిల్‌ వంటి పలు ఔషధాల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ తెలిపింది.


వారు చేసిన పరిశోధన ఏంటంటే.. బ్యాటరీల్లో శక్తి నిల్వ చేయడం దగ్గర్నుంచీ రకరకాల వ్యాధులు ముదిరిపోకుండా చేయడంలో అణు నిర్మాణం కీలకపాత్ర పోషిస్తుంది. ఇందుకు కొన్ని ఉత్ర్పేరకాలు కావాలి. అవి నిర్ణీత రసాయన ప్రతిస్పందనలను నియంత్రిస్తాయి. కొన్ని సందర్భా ల్లో వేగవంతం చేస్తాయి. అయితే, కెమిస్టుల వద్ద రెండు రకాల ఉత్ర్పేరకాలు మాత్రమే ఉండేవి. ఒకటి లోహాలు, రెండు ఎంజైములు. ఈ రెండూ కాకుండా సూక్ష్మ ఆర్గానిక్‌ మాలిక్యూల్స్‌ను ఉత్ర్పేరకాలుగా వాడే ప్రక్రియను వీరు అభివృద్ధి చేశారు. దీన్ని అసిమెట్రిక్‌ ఆర్గనోకెటలిసిస్‌ అంటారు. ఈ ఆర్గానిక్‌ ఉత్ర్పేరకాలు పర్యావరణహితమైనవే కాక చౌకగా ఉత్పత్తి చేయొచ్చు. వీరి పరిశోధనలు ఫలించడంతో 2000 సంవత్సరం నుంచి ఆర్గనోకెటలిసిస్‌ ప్రక్రియ అనూహ్య వేగంతో అభివృద్ధి చెందింది. వీటి సాయంతో కొత్త ఔషధాలు అభివృద్ధి చేయొ చ్చు.


సోలార్‌ సెల్స్‌లో కాంతిని బంధించొచ్చు. భారీ సంఖ్యలో అసౌష్టవ అణువులను అత్యంత సులభంగా తయారు చేయొచ్చు. రసాయనశాస్త్రంలో ఈ ఏటి నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్న ఇద్దరిలో బెంజమిన్‌ లిస్ట్‌ 1968లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జన్మించారు. 1997లో గొతె యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం జర్మనీలోని మాక్స్‌ప్లాంగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కోల్‌రిసెర్చ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. డేవిడ్‌ మెక్‌మిలన్‌ 1968లో యూకేలోని బెల్‌షిల్‌లో జన్మించారు. క్యాలిఫోర్నియా వర్సిటీ నుంచి 1996లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రస్తుతం అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కాగా, 1901లో తొలిసారి రసాయన శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించినప్పటి నుంచి ఇప్పటిదాకా 187 మంది ఈ బహుమతిని అందుకున్నారు. వారిలో మహిళలు ఏడుగురే. బ్రిటిష్‌ బయోకెమిస్ట్‌ ఫ్రెడరిక్‌ సాంగర్‌ 1958లో, 1980లో.. రెండుసార్లు కెమిస్ట్రీ నోబెల్‌ అందుకుని చరిత్ర సృష్టించారు. ఇప్పటిదాకా రసాయన శాస్త్రానికి సంబంధించి అత్యధిక నోబెల్‌ పురస్కారాలు అమెరికన్లకు వచ్చాయి. కెమిస్ట్రీలో 72 మందికి నోబెల్‌ రాగా.. జర్మనీ, యూకే చెరి 34 పురస్కారాలతో రెండోస్థానంలో ఉన్నాయి.

Updated Date - 2021-10-07T12:50:50+05:30 IST