ఆ ఒక్కటి తప్ప.. మిగతావి మాట్లాడుకుందాం..!

ABN , First Publish Date - 2021-10-19T14:29:35+05:30 IST

ఆ ఒక్కటి తప్ప..

ఆ ఒక్కటి తప్ప.. మిగతావి మాట్లాడుకుందాం..!

21న అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్‌ భేటీ

ఆర్థిక అంశాల జోలికి వెళ్లొద్దని స్పష్టీకరణ

ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల విస్మయం

నెలాఖరులోపు పీఆర్సీ తేల్చేస్తామన్నారుగా!

సజ్జల హామీని గుర్తుచేస్తూ విమర్శలు


అమరావతి(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ, డీఏ ఎరియర్‌లు తదితర ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. అవి తప్ప మిగతావి మాట్లాడుకుందామంటూ ప్రభుత్వం అన్నిశాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులను ఆహ్వానించింది. ఈ నెల 21వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.


సమావేశం నోట్‌ను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ సోమవారం అన్ని శాఖల కార్యదర్శులకు పంపారు. ‘ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకుందాం. కానీ, ఫైనాన్షియల్‌ మేటర్‌ మాత్రం వద్దు. అంటే ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు లాంటివి ఏం మాట్లాడటానికి వీల్లేదు’ అంటూ నిబంధన పెట్టారు. ఈ నెల 18, 19 తేదీల్లో సీఎస్‌ పీఆర్‌సీపై ఉద్యోగ సంఘాల నేతలతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేస్తారని, ఈ నెలాఖరులోపు పీఆర్సీ సమస్య తేల్చేస్తామని ఇటీవల ఉద్యోగ సంఘాల జేఏసీలతో భేటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. దీంతో ఆ సమావేశం కోసం పిలుపు వస్తుందని ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అలాంటిదేమీ జరగకపోవడంతో ఉద్యోగుల్లో పలు అనుమానాలు ప్రారంభమయ్యాయి. పీఆర్‌సీ, సీపీఎస్‌ వంటివి ఇప్పట్లో తేలేనా? ఈ నెలాఖరు నాటికి పీఆర్సీ ప్రకటన వస్తుందా? ఆలస్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


పీఆర్సీ సంగతి తేలేది ఎప్పుడో?  

ఇప్పటికే 42 నెలలుగా ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పీఆర్సీ కూడా 21 నెలలు దాటలేదు. మూడు డీఏల బకాయిలు ఉన్నాయి. మూడు ఫ్రీజింగ్‌ డీఏల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవేవీ పట్టనట్లు ఆర్థికేతర అంశాలపై అంత అత్యవసరం ఏమొచ్చిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరల భారం, కరోనాతో కకావికలమైన కుటుంబాల సమస్యలతో ఉద్యోగులు తలకిందులవుతుంటే.. వీటన్నింటి కంటే ఆర్థికేతర సమస్యలు అతి ముఖ్యమైనవా అని ఉద్యోగులు వాపోతున్నారు. 


ఇప్పటికీ ఆ 2 డీఏలకు పడని ఎరియర్స్‌... 

ప్రభుత్వం ఉద్యోగులకు 2018 జూలై, 2019 జనవరి డీఏలు చెల్లించి నెలలు గడుస్తున్నా, ఆ డీఏలకు సంబంధించిన బకాయిలు  అంటే ఒక్కొక్క ఉద్యోగికి సుమారు 90 నెలల బకాయిలు ఇప్పటికీ వారి ఖాతాల్లో పడలేదు. వారి వేతనాల్ని బట్టి ప్రతి ఉద్యోగికి సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సీఎం జగన్‌ వారంలో రద్దు చేస్తామన్న సీపీఎ్‌సపైనా సమావే శం లేదు. ప్రతి నెల ఒకటో తేదీన జీతం, పెన్షన్‌ పడటంలేదు. ఇలాంటివి ముఖ్యమైన అంశాలు కావన్నట్లు, ఆ ర్థికేతర అంశాలే ఉద్యోగుల ప్రధాన సమస్యలైనట్లు ఈ సమావేశం ఏమిటని ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.Updated Date - 2021-10-19T14:29:35+05:30 IST