కీలక నిర్ణయం తీసుకున్న Jagan సర్కార్

ABN , First Publish Date - 2021-10-19T13:22:23+05:30 IST

ఏపీ సర్కారు..

కీలక నిర్ణయం తీసుకున్న Jagan సర్కార్

కారుణ్యానికి ఓకే!

కొవిడ్‌తో మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల్లో కారుణ్య నియామకాలు

నవంబరు 30 కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం

‘కాటికెళ్లినా కనికరించరా!’ కథనంతో కదలిక

మరి ఇతర ప్రయోజనాల మాటేంటి?

పీఎఫ్‌, గ్రాట్యుటీ, బీమా బాండ్ల సంగతేంటి?


అమరావతి(ఆంధ్ర‌జ్యోతి): కొవిడ్‌బారిన పడి అర్ధాంతరంగా కన్నుమూసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆ కుటుంబాల్లోని అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని నిశ్చయించింది. దశాబ్దాల పాటు సేవలందించిన పలువురు సిబ్బంది కరోనా మహమ్మారికి బలై చనిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ఎవరు చనిపోయినా వారి కుటుంబంలోని ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమివ్వడం రివాజు. కానీ రాష్ట్రప్రభుత్వంలో నిన్నటివరకు ఏ మాత్రం కదలిక లేదు. సంపాదనపరులు చనిపోవడంతో కకావికలమైన ఉద్యోగ/ఉపాధ్యాయ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేదనకు గురిచేయడంపై కొన్నిరోజుల క్రితం ‘కాటికెళ్లినా...కరుణించరా’ అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.


కొవిడ్‌తో చనిపోయిన ఉద్యోగ/ఉపాధ్యాయ కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలివ్వాలని స్వయంగా సీఎం అధికారులను ఆదేశించారు. నవంబరు 30నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. వాస్తవానికి కారుణ్య నియామకాలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ గతంలోనే ఉత్తర్వులు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొంది. ఈ నియామకాల విషయంలో ఒక్క విశాఖ జిల్లా కలెక్టర్‌ మాత్రం కొంత చొరవ తీసుకున్నా.. మిగతా జిల్లాల్లో కలెక్టర్లు పక్కనపడేశారని ‘ఆంధ్రజ్యోతి’ తన కథనంలో ప్రస్తావించింది.


ఆ ప్రయోజనాలు చెల్లించేదెప్పుడో?

కారుణ్య నియామకాలతో పాటు చనిపోయిన ఉద్యోగ/ఉపాధ్యాయ కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్రయోజనాల గురించీ ప్రభుత్వం ఆలోచించాలని ఆ వర్గాలు కోరుతున్నాయి. చనిపోయినవారికి సంబంధించి రావలసిన ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ, బీమా బాండ్లను ఇప్పటివరకు చెల్లించలేదు. సర్వీసులో ఉండి పదవీ విరమణ చేసినవారికి పెద్దఎత్తున ఈ బకాయిలు రావలసి ఉంది. ఏడాది నుంచి ఇదిగో అదిగో అంటూ ఊరించడమే తప్ప చెల్లింపులు జరగడం లేదు. చెల్లించాల్సిన ప్రయోజనాలు దాదాపు రూ.500 కోట్ల వరకు ఉన్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది.Updated Date - 2021-10-19T13:22:23+05:30 IST