బుడిబుడి అడుగులతో మళ్లీ బడికి

ABN , First Publish Date - 2021-11-02T13:50:51+05:30 IST

శుభ్రమైన దుస్తులు.. భుజాలకు..

బుడిబుడి అడుగులతో మళ్లీ బడికి

తమిళనాడు, కేరళ, ఢిల్లీల్లో ప్రత్యక్ష బోధన షురూ


న్యూఢిల్లీ, నవంబరు 1: శుభ్రమైన దుస్తులు.. భుజాలకు పుస్తకాల బ్యాగులు.. చేతిలో మంచినీళ్ల సీసా.. ముఖాన చిరునవ్వుతో.. ఆత్మవిశ్వాసంతో హుషారుగా పాఠశాలలకు చిన్నారులు..! ఏడాదిన్నర తర్వాత స్నేహితులతో కలిసి కూర్చుని.. సరదా సరదాగా ముచ్చట్లు..! ఇవీ సోమవారం ఢిల్లీ, తమిళనాడు, కేరళలో కనిపించిన దృశ్యాలు. 19 నెలల అనంతరం దేశ రాజధానిలో 1వ తరగతి నుంచి పై తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది.  వీరిలో చాలామంది చిన్నారులు తొలిసారి పాఠశాల ముఖం చూశారు. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి నుంచి పాఠశాలలు తెరుచుకోలేదు. 2020-21 విద్యా సంవత్సరం పూర్తిగా ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమైంది.


దీంతో నిరుడు నర్సరీలో చేరినవారు.. ఏడాదిన్నర తర్వాత బడిబాట పట్టారు. ఒక్క కేరళలోనే ఆరు లక్షలమందికి పైగా విద్యార్థులు కొత్తగా చేరారు. ఢిల్లీలో అన్ని జాగ్రత్తలతో 50ు సామర్థ్యంతో 1 నుంచి 8వ క్లాసుల వారికి తరగతులు మొదలయ్యాయి. తమిళనాడులో చెన్నై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గూండీలో నడిచే పాఠశాల కు వెళ్లిన సీఎం ఎంకే స్టాలిన్‌.. విద్యార్థులకు కిట్‌లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు, చాక్లెట్లు అందజేసి సాదర స్వాగతం పలికారు. కేరళలో పాఠశాల యాజమాన్యాలు పుస్తకాలు, పెన్నులు, శానిటైజర్లతో గిఫ్ట్‌ ప్యాక్‌లిచ్చాయి.


8 నుంచి కేంద్ర ఉద్యోగులకు బయోమెట్రిక్‌  

కొవిడ్‌ కారణంగా నిలిపివేసిన ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరును ఈ నెల 8 నుంచి పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి విభాగాల అధిపతులు బాధ్యత తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఆదివారం 12,514  కేసులు నమోదయ్యాయి. 251 మంది చనిపోయారు.


ప్రపంచవ్యాప్త మరణాలు.. 50 లక్షలు

కరోనాతో ప్రపంచవ్యాప్త మృతుల సంఖ్య 50 లక్షలకు చేరినట్లు జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ తెలిపింది. అమెరికాలో అత్యధికగా 7.40 లక్షల మంది చనిపో యారు. భారత్‌లో 4.58లక్షల మంది మృతి చెందారు.


కొవాక్సిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా 

మెల్‌బోర్న్‌, నవంబరు 1 : భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన కొవాక్సిన్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది. ఈ టీకా వేసుకున్న 12 ఏళ్లకు పైబడిన వారందరిని తమ దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. ఈమేరకు ఆస్ట్రేలియా ఔషధ నియంత్రణ విభాగం థెరప్యూటిక్‌ గూడ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. కొవాక్సిన్‌ను గుర్తించినందుకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. కొవాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులపై నవంబరు 3న  డబ్ల్యూహెచ్‌వో నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈనేపథ్యంలో టీకా అదనపు సమాచారాన్ని గత వారమే డబ్ల్యూహెచ్‌వోకు భారత్‌ బయోటెక్‌ సమర్పించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-11-02T13:50:51+05:30 IST