Inter Exams: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా..

ABN , First Publish Date - 2021-11-23T15:06:33+05:30 IST

ఈ ఏడాది కూడా..

Inter Exams: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా..

ఇంటర్‌లో ఈ ఏడాదీ 70% సిలబస్సే

ప్రకటించిన ఇంటర్‌ బోర్డు


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది కూడా 70% సిలబస్‌తో పరీక్షలకు వెళ్లాలని నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ జలీల్‌ సోమవారం ప్రకటించారు. పాఠశాల విద్య విభాగం అధికారులు 70% సిలబస్‌ విధానాన్ని అమలు పరుస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కుదించిన సిలబస్‌తోనే విద్యా బోధన, పరీక్షలను నిర్వహించనున్నారు. గత ఏడాది కరోనా కారణంగా విద్యా బోధన సరిగ్గా జరగలేదు. ఆన్‌లైన్‌ విద్య అందరికీ అందుబాటులో లేకపోవడం.. ఉన్నా, ఆఫ్‌లైన్‌ అంత వివరణాత్మకంగా లేకపోవడంతో సిలబస్‌ను 70 శాతానికి కుదించారు.


ఈ సిలబస్‌ ప్రకారమే పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షల సమయంలోనూ కరోనా ఉధృతమవ్వడంతో పరీక్షలను రద్దు చేశారు. ఇలా 10వ తరగతి పరీక్షలు రాయకుండానే.. విద్యార్థులు ఇంటర్‌లోకి ప్రవేశించారు. అప్పట్లో ఇదే కారణంతో ఇంటర్‌ పరీక్షలు కూడా రద్దయ్యాయి. అయితే ఇటీవల ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది కూడా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా (సెప్టెంబరు 1 నుంచి) ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు 70%  సిలబస్‌ను అమలు పరచాలని నిర్ణయించారు. గత ఏడాది మాదిరిగానే విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు మోడల్‌ ప్రశ్నపత్రాలను రూపొందించనున్నట్టు అధికారులు ప్రకటించారు.


ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది అడ్మిషన్ల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలతోపాటు రెసిడెన్షియల్‌ కళాశాలలకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పారు. కొన్ని జూనియర్‌ కళాశాలలకు ఇంకా ప్రభుత్వ అనుమతి రాకపోవడంతో గడువు పొడిగించారని సమాచారం.



Updated Date - 2021-11-23T15:06:33+05:30 IST