ఉద్యోగాల పేరుతో 241 మందికి టోకరా

ABN , First Publish Date - 2021-11-23T14:26:34+05:30 IST

‘స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌’ విభాగంలో..

ఉద్యోగాల పేరుతో 241 మందికి టోకరా

ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల దాకా వసూలు

ముగ్గురు నిందితులకు బేడీలు.. 21.7 లక్షల స్వాధీనం


హనుమకొండ: ‘స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌’ విభాగంలో ఉద్యోగాల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో 241 మంది నిరుద్యోగులకు రూ. కోటి మేర కుచ్చుటోపీ పెట్టిన ముఠా ఆటను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కట్టించారు. సోమవారం వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి వివరాలు వెల్లడించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన చల్లా వినయ్‌పాల్‌రెడ్డి(37) ములుగు జిల్లా బండారుపల్లె గ్రామంలో వీఆర్వోగా పనిచేసేవాడు. వడ్డెపల్లి సురేంద్రపురికి చెందిన పోరిక అనసూయ ములుగు రెవెన్యూ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసేది. అప్పటికే వివాహితులై.. కుటుంబాలు ఉన్న వీరిద్దరూ.. కొంత కాలం సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అనసూయ సమీప బంధువు లావుడ్యా సాకేత్‌తో కలిసి వీరంతా నకిలీ దస్తావేజులు, డాక్యుమెంట్ల దందాకు తెరతీశారు. 2012లో పోలీసు కేసు కావడంతో.. వినయ్‌పాల్‌, అనసూయ తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ ముగ్గురు కొంత కాలం ఢిల్లీ వెళ్లారు. 


ఆ సమయంలో వీరికి రాజ్‌.కేపీ.సిన్హా అనే మోసగాడు పరిచయమయ్యాడు. అతను స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జాతీయ కమిషనర్‌గా చెప్పుకొంటూ మోసాలకు పాల్పడేవాడు. అతనితో జతకట్టిన వినయ్‌పాల్‌, అనసూయ, సాకేత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో ఉద్యోగాల పేరుతో తెలుగు యువతకు గాలం వేశారు. నిరుద్యోగులతో వినయ్‌పాల్‌ తనకుతాను ఏపీ విభాగం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌ అని పరిచయం చేసుకునేవాడు. అనసూయను తెలంగాణ కమిషనర్‌గా, సాకేత్‌ను హైదరాబాద్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పరిచయం చేసేవాడు. అలా 2019 నుంచి 241 మంది నిరుద్యోగులకు కుచ్చుటోపీ వేశారు. ఒక్కొక్కరి నుంచి రూ. 3 నుంచి రూ. 5 లక్షల చొప్పున సుమారు రూ. కోటి వరకు వసూలు చేశారు. ఈ ముఠా వీరిని నిమ్మించడానికి నల్లగొండ, వరంగల్‌లో 15 రోజుల పాటు శిక్షణనిప్పించింది. ఆ తర్వాత వేర్వేరు స్కూల్లలో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఇన్‌చార్జులుగా వివిధ హోదాలతో నకిలీ నియామక పత్రాలను అందజేసింది. వాటిని పట్టుకుని, తమకు కేటాయించిన స్కూళ్లకు వెళ్లిన నిరుద్యోగులంతా ఖంగుతిన్నారు. అక్కడ అలాంటి పోస్టులు లేవని తెలుసుకుని.. తాము మోసపోయినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌ సిన్హా మినహా.. మిగతా నిందితులను సోమవారం వరంగల్‌ చౌరస్తాలో  అరెస్టు చేశారు. వారివద్ద రూ.21.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-23T14:26:34+05:30 IST