ఏ లోటూ లేని ‘భరోసా’!

ABN , First Publish Date - 2021-11-20T06:58:02+05:30 IST

వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 2020–21 సంవత్సరంలో 49.40 లక్షల రైతు కుటుంబాలకు రూ.6750.67 కోట్లు అందించాం. 2021–22 సంవత్సరం మే నెల మొదటి విడతలో...

ఏ లోటూ లేని ‘భరోసా’!

వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 2020–21 సంవత్సరంలో 49.40 లక్షల రైతు కుటుంబాలకు రూ.6750.67 కోట్లు అందించాం. 2021–22 సంవత్సరం మే నెల మొదటి విడతలో 49.87 లక్షల రైతు కుటుంబాలకు రూ.3811.96 కోట్లు అందించాం. అక్టోబర్ 2021, రెండవ విడతలో 50.37 లక్షల రైతులకు రూ.2051.71కోట్ల లబ్ధిని అందించాం.


పథకం పేరుకే ‘భరోసా’ శీర్షికతో నవంబరు 6న ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ప్రచురితమైన వ్యాసం సత్యదూరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి అక్టోబర్ 15, 2019 నుంచి ‘వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.13,500 చొప్పున (రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.7500, కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ పథకం ద్వారా రూ.6000కలిపి) లబ్ధిని మూడు విడతల్లో రైతుల ఖాతాలలో జమ చేస్తోంది.


వెబ్ ల్యాండ్ సమాచారం ఆధారంగా ఈ పథకం కింద లబ్ధిదారులను గుర్తించిన తర్వాత, వారికి మొదటి విడత రూ.7500 మే నెలలో అందజేస్తున్నాం. రెండవ విడత రూ.4000 పిఎం కిసాన్ లబ్ధిని అక్టోబరు నెలలో, మూడవ విడత రూ.2000 పిఎం కిసాన్ లబ్ధిని జనవరి నెలలో అందజేస్తున్నాం. అదే విధంగా రాష్ట్రంలోని భూమి లేని షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు, వెనకబడిన కులాలు, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు, అటవీ భూమి సాగుదారులకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున ఆర్థికసాయం అందజేయడానికి అవసరమైన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. వీరికి కూడ మొదటి విడత రూ.7500 లబ్ధిని మే నెలలో, రెండవ విడత రూ. 4000 లబ్ధిని అక్టోబరు నెలలో, మూడవ విడత రూ.2000 లబ్ధిని జనవరి నెలలో అందజేస్తున్నాం. 2019–20 సంవత్సరంలో 45లక్షల రైతు కుటుంబాలకు రూ.6162.45 కోట్లు అందజేశాం. (వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రూ.3637.45 కోట్లు, పిఎం కిసాన్ ద్వారా రూ.2525కోట్లు). ఈ పథకం ద్వారా 2020–21 సంవత్సరంలో 49.40 లక్షల రైతు కుటుంబాలకు రూ.6750.67 కోట్లు అందించాం. 2021–22 సంవత్సరం మే నెల మొదటి విడతలో 49.87 లక్షల రైతు కుటుంబాలకు రూ.3811.96 కోట్లు అందించాం.


అక్టోబర్ 2021, రెండవ విడతలో 50.37 లక్షల రైతులకు రూ.2051.71కోట్ల లబ్ధిని అందించాం. ఈ లబ్ధిదారులలో మొత్తం రైతులు 50,37,349. భూ యజమాని కుటుంబాలు 48,86,361. RoFR భూమి సాగుదారులు 82251. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు 68737. రాష్ట్రంలో 15లక్షల కౌలుదారులున్నప్పటికీ, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులను గుర్తించి వారికి ఈ పథకం లబ్ధిని అందిస్తున్నాం.  రైతు భరోసా లబ్ధిదారుడు చనిపోతే వారి నామినీకి ఈ లబ్ధిని అందిస్తున్నాం. కానీ పిఎం కిసాన్ పథకంలో లబ్ధిదారులు చనిపోతే వారి భూమి మ్యుటేషన్ జరిగిన పిమ్మట మాత్రమే వారు లబ్ధి పొందగలుగుతారు.  రైతు భరోసా లబ్ధిని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా బ్యాంకు ఖాతాకు ఆధార్, NPCI లింక్ ఉన్న వారికి నేరుగా జమ చేయడం చేస్తున్నాం. NPCI ఆక్టివ్‌గా లేని వారి వివరాలను గ్రామాలవారీగా గ్రామస్థాయి అధికారులకు అందజేసి అటువంటి రైతులను సంబంధిత బ్యాంకులకు పంపి వారి బ్యాంకు ఖాతాలను ఏక్టివ్ చేయించి వారికి కూడా లబ్ధిని అందజేస్తున్నాం.


ప్రతి విడత పథకం లబ్ధి విడుదల తరువాత ప్రతి లబ్ధిదారుడు వారి చెల్లింపుల స్థితిని తెలుసుకునే విధంగా రైతు భరోసా పోర్టల్‌లో సదుపాయాన్ని కల్పించాం. పీఎం కిసాన్ పథకం ప్రకారం అర్హులు లబ్ధి పొందకలేకపోతే అందుకు వివిధ కారణాలు ఉన్నాయి. ఆధార్, కరెక్షన్స్, బ్యాంకు అకౌంట్ కరెక్షన్స్, ఒకే కుటుంబానికి చెందినవారై ఉండటం వీటిలో ఏవైనా కావొచ్చు. గ్రామస్థాయి అధికారులు రైతులను సంప్రదించి వారి వివరాలను సరిచేసి తిరిగి వాటిని పిఎం కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడం జరుగుతోంది. ఎంతో పారదర్శకతతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకానికి అర్హులను, అనర్హులను గుర్తించటానికి గాను రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తున్నాం. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఈ పథకంపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అక్కడ అర్హులై ఉండీ లబ్ధి పొందని వారి పేర్లను గ్రీవెన్స్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నాం.


పూనం మాలకొండయ్య,ఐఏఎస్ 

చీఫ్ కమిషనర్, ఆర్బీకే అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్, కో-ఆపరేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Updated Date - 2021-11-20T06:58:02+05:30 IST